అమరావతికి పూర్వవైభవం తెస్తా

Jan 30,2024 00:22

సభలో మాట్లాడుతున్న చంద్రబాబు
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి/చేబ్రోలు :
వైసిపి ఐదేళ్ల పాలనలో అభివృద్ధి లేదని, విధ్వంసం, వినాశకరమైన ఆలోచనలతో అరాచకాలను ప్రోత్సహించి ప్రజలను సిఎం జగన్‌ తీవ్రంగా ఇబ్బందికి గురిచేశారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సోమవారం సాయంత్రం చేబ్రోలు మండలం వడ్లమూడిలో జరిగిన ‘రా కదలిరా’ సభలో ఆయన ప్రసంగించారు. సభకు టిడిపి జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్‌కుమార్‌ అధ్యక్షత వహించగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌ ఒక సైకో…ఆయనతో పాటు ఊరికో సైకో తయారయ్యాడని వీరంతా ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. సిఎంగా ప్రజల్లోకి వెళ్లలేని వ్యక్తి జగన్‌ ఒక్కరేనన్నారు. ఇప్పటికీ పరాదాలు కట్టుకుని వెళ్లడం తప్ప స్వేచ్చగా బయటకురాలేరన్నారు. టిడిపి హయాంలో ఉచితంగా అందే ఇసుకను కేజీల లెక్కన అమ్ముకోవడం జగన్‌ మార్క్‌ అరచాకం అన్నారు. దళితుల్ని చంపి డోర్‌ డెలివరీ చేయడం మరో అరాచకమన్నారు. పోలవరం నాశనం చేసి అమరావతిని నిర్వీర్యం చేశారని, నాడు-నేడు పేరుతో పేద పిల్లలకు విద్యను దూరం చేయడం, ఉపాధ్యాయుల నియామకం లేకుండా విద్యా వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. తనది విజన్‌ అని.. జగన్‌ది పాయిజన్‌ అని, తాను ఐటీని ప్రోత్సహించి కంపెనీలు తెస్తే.. జగన్‌ రెడ్డి ఐదువేలకు వాలంటీర్‌ ఉద్యోగాలిచ్చారని, ఫిష్‌ మార్టులు, మటన్‌ కొట్లు, మద్యం కొట్లు అంటూ యువత జీవితాలను చిత్తు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రన్న బీమా, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు లాంటి దాదాపు 130 పథకాలు రద్దు చేశారన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ ఎవరూ చేయని సాహసం అమరావతి రైతులు చేస్తే అమరావతిపై కులం ముద్ర వేశారని, లక్షల మందికి ఉపాధినిచ్చే అమరావతిని నాశనం చేశాని విమర్శించారు.
ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డ చంద్రబాబు
పొన్నూరు కిలాడీ.. గ్రావెల్‌ రోశయ్యగా మారాడు. పొన్నూరు గ్రావెల్‌ ఫీల్డ్‌ తయారు చేశాడు. కేజీఎఫ్‌ని మరిపించేలా ఖిలాడీ తవ్వేశాడని ఎమ్మెల్యే రోశయ్యపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. 700 ఎకరాల్లో రూ.2 వేల కోట్ల విలువైన మట్టి అమ్మేశాడన్నారు. గుంటూరు పాడి రైతుల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యమైన సంగం డెయిరీపై దాడి చేశారని, చైర్మన్‌ నరేంద్రను జైల్లో పెట్టారని, ఇందుకు వైసిపి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్‌కె తమపై ఎన్నో కేసులేశాడని, జగన్‌కు ఎంతో నమ్మకంగా ఉన్నాడని అయినా ఆయన్ను ఒక తన్నుతన్నాడని ఎద్దేవా చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా.. గంజాయి, గుట్కా, డ్రగ్స్‌ లాంటి చేయని వ్యాపారం లేదని, పనిమనిషి కొడుకు టిడిపి నేతలతో తిరిగాడని తల్లిపై తప్పుడు కేసు పెట్టాడని ఆరోపించారు. టిడిపి నుంచి వెళ్లిన మద్దాలి గిరి ఇప్పుడు చిత్తుకాగితాం అన్నారు. చిలకలూరిపేటలో చెత్తగా మారిన రజిని గుంటూరులో బంగారం అయిపోతుందా? అని ఎద్దేవ చేశారు. ప్రత్తిపాడుకు చెందిన మాజీ హోం మంత్రి.. దిశ చట్టం ఉందని చెప్పేవారని, ఎక్కడ అంటే సమాధానం లేదని, పదవులిప్పిస్తామని సొంత పార్టీ వారి దగ్గర డబ్బులు లాక్కోవడం తప్ప సుచరిత ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. తెనాలి ఎమ్మెల్యే మున్సిపల్‌ సిబ్బందిని ఇంట్లో పని మనుషులుగా వాడేస్తాడన్నారు. కంకర నుండి ఇసుక వరకు ఏదీ వదలడన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై అంబటి రాంబాబు రాళ్ల దాడి చేయించారని, ఆంబోతు అంబటికి కళ్లెం వెస్తానని ఆగ్రహంగా మాట్లాడారు. మాచర్లలో దుర్గారావు అనే మత్స్యకార కార్మికుడు పార్టీ మారను అన్నందుకు వేధించి ఆత్మహత్య చేసుకునేలా వేధించాడని, పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కొట్టి, భయపెట్టి వేధింపులు భరించలేక చనిపోయాడు. అదే మాచర్లలో తోట చంద్రయ్య వైసిపికి జై కొట్టమంటే కొట్టనందుకు పీక కోసి చంపారని, ఇలాంటి వేధింపులతో బలైపోయిన వారంతా తిరుగుబాటు చేయడం తధ్యమని హెచ్చరించారు.
మూడు ప్రాంతాలూ ఏకమై.. జగన్‌ రెడ్డి రెక్కలు విరగ్గొట్టాలి
జగన్‌ రెడ్డి పార్టీ ఫ్యాన్‌ మూడు రెక్కలు విరగ్గొట్టేందుకు ప్రజలంతా ఏకమవ్వాలని, బాదుడే బాదుడు రెక్కను ఉత్తరాంధ్ర వాళ్లు విరగ్గొట్టాలని. విధ్వంసాల రెక్కను రాయలసీమ వాసులు విరగ్గొట్టాలని, హింసా రాజకీయాలను కోస్తా వాసులు విరగ్గొట్టాలని, రెక్కల్లేని ఫ్యాన్‌ తాడేపల్లిలో కూర్చోబెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగాలొస్తాయనే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. పొన్నూరులో ఉండి.. కాలిఫోర్నియాలో ఉద్యోగం చేసుకుందాం.. వర్క్‌ ఫ్రం హోం విధానంలో ఉద్యోగాలు పొందుదాం.. మండల కేంద్రాల్లో వర్క్‌ స్టేషన్లు కట్టించి అక్కడే కలిసి పని చేసుకునే సదుపాయం కల్పిస్తాం.. అని చెప్పారు. ప్రతి గడపనా రా కదలి రా అనే నినాదం వినిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సభలో జనసేన, టిడిపి జెండాలను పట్టుకుని చంద్రబాబు ఊపారు. రెండుపార్టీల కలయిక రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరమన్నారు. కార్యక్రమంలో ఎంపి కనకమేడల రవీంద్రకుమార్‌, మాజీ ఎంపి కొనకళ్ల నారాయణ, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్‌, సంగం డెయిరీ చైర్మన్‌ దూళిపాళ్ల నరేంద్రకుమార్‌, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాసయాదవ్‌, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబు, నన్నపనేని రాజకుమారి, మాకినేని పెద రత్తయ్య, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, టిడిపి నాయకులు రాయపాటి శ్రీనివాస్‌, నశీర్‌ అహ్మద్‌, కోవెలమూడి రవీంద్ర, బి.రామాంజనేయులు తదితరులు ప్రసంగించారు.

➡️