అరకు ఎమ్‌పి సీటు గీతకేనా.?

Mar 9,2024 21:33

ప్రజాశక్తి – సాలూరు : టిడిపి, జనసేన, బిజెపితో పొత్తు ఖరారైంది. పొత్తులో భాగంగా పది ఎమ్మెల్యే సీట్లు, ఆరు ఎంపీ సీట్లు బిజెపి పోటీ పడుతుంది. ఆరు ఎంపీ సీట్లలో అరుకు ఎంపీ నియోజకవర్గం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అరుకు ఎంపి సీటు తనకే వస్తుందన్న ధీమాతో మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఎక్కడికక్కడ ప్రచార హౌర్డింగులు ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీ గీతను ఇప్పటికీ కుల వివాదం వెంటాడుతూనే ఉంది. ఆమె ఎస్టీ కాదంటూ ఆదివాసీ గిరిజన సంఘాలు పోరాటం చేస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ గతంలో ఆమె ఎస్టీ కాదని నివేదిక ఇచ్చారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పరిశీలక కమిటీ కూడా ఆమె ఎస్టీ కాదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కోర్టు నుంచి ఆమె స్టే తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. 2014లో ఆమె అరుకు పార్లమెంటు నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు రాష్ట్రంలో వైసిపి ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందింది. గెలిచిన తర్వాత కొన్నాళ్లకే ఆమె వైసిపిని వీడి అధికారంలో ఉన్న టిడిపికి దగ్గరగా వ్యవహరించారు. కొన్నేళ్ల తర్వాత సొంత పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ పార్టీని బిజెపిలో విలీనం చేశారు. ఇప్పుడు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్న గీతకే అరుకు ఎంపీ సీటు దక్కే అవకాశాలున్నాయి. కులవివాదాన్ని ఎదుర్కొంటున్న గీత టిడిపి, జనసేన, బిజెపిల ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నారు. దీంతో ఆమెకు పోటీగా వైసిపి తరపున ఎంపీ అభ్యర్థి ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. జిసిసి చైర్‌పర్సన్‌ డాక్టర్‌ శోభా స్వాతిరాణి అరుకు ఎంపీ సీటు రేసులో వున్నారు. ఇప్పటికే ఆమె తన ఓటును ఎస్‌.కోట నియోజకవర్గం నుంచి సాలూరుకు బదిలీ చేయించుకున్నారు. డాక్టర్‌ స్వాతీరాణి ఎస్టీ భగత సామాజిక వర్గానికి చెందిన నాయకులు కావడం, అరుకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భగత సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉండడం ఆమెకు అనుకూల పరిణామంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఆమె భర్త గుల్లిపిల్లి గణేష్‌కు సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నాయకులతో సత్సంబంధాలు వుండడం కూడా అనుకూల పరిణామంగా చెప్పవచ్చు. వైసిపి ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని ప్రకటించినా మార్పు తథ్యమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైసిపి ఎంపీ సీటు కోసం డిమాండ్‌ పెరుగుతోంది. డిప్యూటీ సిఎం రాజన్నదొర కూడా ఎంపీ రేసులో వున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిస్థానం ఎంపీ సీటు ఇస్తే పోటీ చేస్తానని రాజన్నదొర పలు మార్లు ప్రకటించారు. అయితే సిఎం జగన్‌ దష్టిలో ఏముందో ఇంతవరకు అంతు చిక్కడం లేదు. అభ్యర్ధుల జాబితా విడుదల అయితే గాని సస్పెన్స్‌ కి తెర పడే అవకాశం లేదు.

➡️