అరాచక పాలన అంతమొందించడమే లక్ష్యం

Dec 24,2023 21:32

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : రాష్ట్రంలోని అన్ని వర్గాలు వైసిపి పాలనలో అనుభవిస్తున్న అరాచకాలను అంతమొందించడమే లక్ష్యంగా పనిచేయాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక బైపాస్‌ రోడ్‌లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఫ్యాక్షినిజంతో ప్రత్యర్థులతో పాటు ప్రజలను అంతమొందించడమే లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్న వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అహంకారాన్ని అణిచివేసి తిరిగి కోలుకోలేని విధంగా బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సంక్షేమ పథకాల పేరిట కోట్లాది రూపాయల రుణ భారాన్ని ప్రజలపై మోపి రాబోయే 20 ఏళ్లకు సరిపడా అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారన్నారు. నాలుగున్నరేళ్ల నియంత పాలనకు ప్రజలు విసిగిపోయి ఇప్పుడిప్పుడే అన్ని వర్గాలు రోడ్ల మీదకు వస్తున్నాయన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్‌ ఉద్యోగులతో పాటు అంగన్వాడీ, ఆశాలకు అలవికాని హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయమని కోరితే నిర్బంధాలు విధిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల తాళాలను ప్రభుత్వమే బద్దలు కొట్టాలని ఉత్తర్వులు ఇవ్వడం ఈ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. నూతన కార్యాలయం వేదికగా కార్యకర్తలు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు ఒకరికొకరు సమన్వయపర్చుకుంటూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. అనంతరం అరుకు పార్లమెంటు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కిడారి శ్రావణ్‌ కుమార్‌, జిల్లా టిడిపి అధ్యక్షులు గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబీ నాయనా మాట్లాడారు. కార్యక్రమంలో పాలకొండ, కురుపాం నియోజకవర్గాల టిడిపి ఇన్‌ఛార్జులు నిమ్మక జయకృష్ణ, తోయక జగదీశ్వరి, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులుతో పాటు సీతానగరం, బలిజిపేట, పార్వతీపురం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️