అరుదైన సాహితీవేత్త ‘ఎండ్లూరి సుధాకర్‌’

ప్రజాశక్తి-ఒంగోలు: ‘వర్తమానం’ కవిత్వంతో సాహిత్య జీవితాన్ని ప్రారంభించిన ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌.. జాషువా గురించి పరిశోధన ద్వారా అరుదైన సాహితీవేత్తగా నిలిచిపోయారని ప్రముఖ కవయిత్రి, సాహితీవేత్త గంగవరపు సునీత అన్నారు. ప్రముఖ కవి, సాహితీవేత్త, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు డాక్టర్‌ ఎండ్లూరి సుధాకర్‌ రెండో వర్థంతి సభ జానుడి-సెంటర్‌ ఫర్‌ లిటరేచర్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలు శ్రీనగర్‌ కాలనీలోని డాక్టర్‌ మల్లవరపు రాజేశ్వరరావు విజ్ఞాన భవన్లో నిర్వహించారు. తొలుత ఎండ్లూరి సుధాకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం నిర్వహించిన సభా కార్యక్రమానికి జానుడి డైరెక్టర్‌ డాక్టర్‌ నూకతోటి రవికుమార్‌ అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా సునీత పాల్గొని ప్రసంగించారు. ‘నల్ల ద్రాక్ష పందిరి’ కవిత్వం నుంచి ఈ సందర్భంగా ‘నీలిక’ కవితని చదివి వినిపిస్తూ ఆధునిక దళిత కవిత్వంలో సుధాకర్‌ సాధించిన విజయాన్ని గురించి వివరించారు. ఈ క్రమంలో కొత్త గబ్బిలం, వర్గీకరణీయం, గోసంగి తదితర కావ్యాలను గురించి తెలిపారు. సభలో ప్రముఖ సాహిత్య పరిశోధకులు డాక్టర్‌ బద్దిపూడి జయరావు మాట్లాడుతూ తన పరిశోధన జీవితాన్ని సుధాకర్‌ ఎంతో ప్రభావితం చేశారని అన్నారు. ఈ సభలో నవలా రచయిత ఎజ్రా శాస్త్రి, బెంగళూరుకు చెందిన సాహితీవేత్త నాతాని హనుమంతరావు, సాహిత్య పరిశోధకుడు నోసిన వెంకటేశ్వర్లు తదితరులు ఎండ్లూరి సుధాకర్‌ సాహిత్య జీవితాన్ని వివరించారు. సభలో కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి అట్లూరి రాఘవులు, ఆర్టీసీ యూనియన్‌ నాయకులు గంగవరపు విజయరావు తదితరులు ప్రసంగించగా వివిధ ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.

➡️