అర్ధాకలితో 104 ఉద్యోగుల కుటుంబాలు

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌.ఆంజనేయ నాయక్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నెలల తరబడి జీతాలు పెడింగ్‌లో పెట్టడం వల్ల 104 వాహన ఉద్యోగుల కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయని ఏపి 104 ఎంఎంయు ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.కృష్ణారెడ్డి, సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయ నాయక్‌ అన్నారు. యూనియన్‌ జిల్లా సమావేశం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని కోటప్పకొండ రోడ్డులో ఉన్న పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. సమావేశానికి ఎం.కృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా ఆంజనేయనాయక్‌ మాట్లాడుతూ 104 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వాహన సేవలను గతంలో మాదిరి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. జీఓ 4459 ప్రకారం పిఎఫ్‌, ఇఎస్‌ఐ సరిగా అమలు చేయాలన్నారు. యాజమాన్యం చెల్లించాల్సిన ఎంప్లాయర్‌ కాంట్రిబ్యూషన్‌ను అరబిందో యాజమాన్యం ఇవ్వాలని కోరారు. 104లో పనిచేస్తున్న డిఇఒలకు వెయిటేజ్‌ మార్కులు కల్పించి ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్‌ చేశారు. అక్రమ బదిలీలు, తొలగింపులకు గురైన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఎం.కృష్ణారెడ్డి మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో 104 ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సిఎం హామీ ప్రకారం 104 ఉద్యోగులను ఆప్కాస్‌లో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించి మెరుగైన జీతాలివ్వాలని కోరారు. 104 వాహనాలను నిర్వహిస్తున్న సంస్థ అరబిందో యాజమాన్యం ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించకుండా 3 నుండి 4 నెలల పాటు పెండింగ్‌లో ఉంచుతోందని, ఇలాగైతే ఉద్యోగుల కుటుంబాలు ఎలా గడవాలని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి నెలనెలా జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. 104 వ్యవస్థను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నూతన కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా పి.కోటేశ్వరరావు, సిహెచ్‌ కృష్ణావాసు, గౌరవాధ్యక్షులుగా ఎస్‌.ఆంజనేయ నాయక్‌, కోశాధికారిగా సిహెచ్‌ అశోక్‌, ఉపాధ్యక్షులుగా షేక్‌ సుభాని, షేక్‌ బాషా, సహాయ కార్యదర్శిగా వెంకట నరసింహారావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా డి.కోటిరెడ్డి, సభ్యులుగా శివ సుధాకర్‌, ఎం.ప్రభాకర్‌, ఎం.మల్లికార్జునరావు, బాలకిరణ్‌, ప్రతాప్‌, ఎస్‌.ఐజాక్‌, రవితేజ, ఝాన్సీ ఎన్నికయ్యారు.

➡️