అర్హులకు ‘సంక్షేమం’ అందించటమే థ్యేయం

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వం థ్యేయమని ప్రకాశం కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు. 2023 ఆగస్టు నుంచి డిసెంబర్‌ వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత ఉన్నప్పటికీ ఏ కారణం చేతనైనా లబ్ధిపొందలేకపోయిన అర్హుల ఖాతాలలో నగదు జమ చేసే కార్యక్రమాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి అనుబంధంగా ప్రకాశం భవనంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఆయన బ్యాంకు చెక్కును అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నవరత్నాలు బైయాన్యువల్‌ మంజూరు పథకంలో భాగంగా గత ఆరు నెలల్లో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలలో అర్హత ఉన్నా లబ్ధిపొందని వారికి 8 పథకాలకు సంబంధించి ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. ఇందులో ఈబిసి నేస్తం, జగనన్న అమ్మ ఒడి, వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం, వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం, వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర, జగనన్న చేదోడు, వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు / షాదీ తోఫా, వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో ఈ పథకాలలో 3,173 మంది లబ్ధిదారులకు రూ.4,73,86,325ను అందిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారు మెరుగైన జీవనోపాధి కోసం ఈ డబ్బులను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ విజరు కుమార్‌, మైనార్టీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మహబూబ్‌, డిఆర్‌డిఏ పీడీ టి.వసుంధర, మెప్మా పీడీ టి.రవికుమాం, మత్య్స శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, మర్కాపురం డిఎల్‌డిఒ ఓ సాయి కుమార్‌, లబ్ధిదారులు పాల్గొన్నారు.

➡️