అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు :పీడీ

ప్రజాశక్తి-కలకడ ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు, అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డ్వామా పీడీ మద్దిలేటి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన కలకడ మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణంలో నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహిస్తున్న పనులలో ఉపాధి హామీ సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసు కోవడమే కాకుండా సొమ్మును రికవరీ చేయడం జరుగుతుందని తెలిపారు. టమోటా పంటను పండిస్తున్న రైతులకు ఉపాధి పనులలో కూలీలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని పీడీని అడుగగా, కేంద్ర ప్రభుత్వం నిర్వహి స్తున్న ఈ పథకంలో టమోటా పంటలకు ఉపాధి పనులు చేయించడం జరగదని అన్నారు. మండలంలోని 16 పంచాయితీలలో 2022 సంవత్సరం ఏప్రిల్‌ నెల నుంచి 2023 మార్చి చివరి వరకు జరిగిన పనులలో గ్రామాలలో గ్రామసభ నిర్వహించి తనిఖీలు చేసినట్టు తెలిపారు.ఉపాధి హామీ ద్వారా1096 పనులుగాను రూ .58465126 ఖర్చు చేసినట్లు ఎపి ఇడబ్ల్యూఐటిసి క్రింద ఒక పనికి రూ.318079, పంచాయతీరాజ్‌ కింద 32 పనులకు రూ.10076708, ఆర్డబ్ల్యూఎస్‌ ద్వారా చేసిన ఒక పనికి రూ.122198, ఖర్చు చేసినట్టు తెలిపారు. సామాజిక తనిఖీలలో అక్రమా లకు పాల్పడిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నుంచి రూ.20వేల 97 రూపాయలు రికవరీ కింద వసూలు చేసినట్టు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన ఐదు మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లకు రూ.6వేలు అపరాధరుసుము వేసినట్లు తెలిపారు. కార్యక్ర మంలో ఎంపిపి శ్రీదేవి రవికుమార్‌, మండల పార్టీ కన్వీనర్‌ కమలాకర్‌ రెడ్డి, సింగల్‌ విండో చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, మండల సచివాలయం చైర్మన్‌ మోహన్‌రాజా నాయుడు, ఎపిడి రవికుమార్‌, అంబులె డేన్స్‌ మెన్‌ శివప్రసాద్‌, డ్వామా విజిలెన్స్‌ అధికారి ప్రకాష్‌, ఎంపిడిఒ పరమేశ్వర్‌ రెడ్డి, ఎస్‌ఆర్‌పి భాస్కర్‌, ఎపిఒ చెన్నకేశవులు, ఉపాధి హామీ సిబ్బంది, సామాజిక తనిఖీ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.

➡️