అవినీతికి పాల్పడ్డ వారిపై న్యాయవిచారణ : లోకేష్‌

Feb 14,2024 21:35

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి  : వైసిపి ఐదేళ్ల పాలనలో అవినీతికి పాల్పడ్డ ప్రజాప్రతినిధులపైనా, అధికారులపైనా జ్యుడీషియల్‌ ఎంక్వయిరీ వేసి శిక్షలు పడేలా చర్యలు చేపడతామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, విజయనగరం జిల్లాలోని బొబ్బిలి నియోజకవర్గం బాడంగిలో బుధవారం జరిగిన శంఖారావం సభల్లో లోకేష్‌ ప్రసంగించారు. రోజుకో మోసం.. పూటకో అబద్దంలా జగన్‌ రెడ్డి పాలన సాగుతోందని విమర్శించారు. జగన్‌రెడ్డికి సినిమా పిచ్చి ఎక్కువైందని, కోట్లు ఖర్చు పెట్టి యాత్ర- 2 సినిమా తీశారని, అది కాస్తా వైసిపి నాయకులకు అంతిమయాత్ర అయింద్యని విమర్శించారు. ఆ సినిమా చూడటానికి ఎవరూ సిద్ధంగా లేరని, సినిమా తీసిన ప్రొడ్యూసర్‌కు నష్టం వచ్చింది, ఆదుకోండని జగన్‌వద్దకు వెళ్తే హార్సిహిల్స్‌లో ఖరీదైన రెండెకరాల ప్రభుత్వ భూమి ఇచ్చేశారని ఆరోపించారు. అది ప్రజల కోసం సినిమా కాదని, నీ మెప్పుకోసం తీసిన సినిమా కాబట్టి ఇడుపుల పాయలో రెండెకరాలు ఇవ్వొచ్చు కదా అని లోకేష్‌ అన్నారు. ఎన్నికల ముందుకు నియోజకవర్గానికో స్టేడియం ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఎక్కడైనా ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. వైసిపి నాయకులు సామాజిక బస్సుయాత్ర చేశారని, అసలు ఆ పార్టీలోనే సామాజిక న్యాయం లేదని అన్నారు. బిసిలకు రావాల్సిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ అని అన్నారు. జగన్‌లా హామీలిచ్చి అమలు చేయని బ్యాచ్‌ తమది కాదని, ప్రతిఏటా జాబ్‌ కేలండర్‌ ఇస్తామని తెలిపారు. ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తినని, రెండు నెలలు ఓపిక పడితే అందరినీ ఆదుకుంటామని లోకేష్‌ హామీ ఇచ్చారు. సూపర్‌ సిక్స్‌ పథకాలపై ఇంటింటికీ ప్రచారం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని లోకేష్‌ అన్నారు. జయహో నినాదంతో బిసిలంతా జగన్‌ను గద్దె దించాలన్నారు. సభలో ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు బోనెల విజరుచంద్ర, జి.సంధ్యారాణి, బేబినాయన, మాజీ ఎమ్మెల్యేభంజ్‌దేవ్‌, మాజీ ఎమ్మెల్యే ద్వారపురెడ్డి జగదీష్‌, జనసేన నాయకులు లోకం మాధవి, ఆదాడ మోహన్‌రావు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ అరకు పార్లమెంటు ఇన్చార్జి కిడారి శ్రావణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️