ఆకులు కట్టుకుని కార్మికుల అర్ధనగ ప్రదర్శన

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్మోహన్‌రెడ్డి తక్షణం నెరవేర్చి మాట నిలబెట్టుకోవాలని మున్సిపల్‌ యూనియన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.చెన్నయ్య, సి.రాంబాబు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం 11వ రోజు రాయచోటిలో మున్సిపల్‌ కార్మికులు స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు)పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద నుండి నడుము, మెడ చుట్టూ ఆకులు గడ్డి మోకులువేసుకుని అర్ధనగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలైన కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల ఉద్యోగాల పర్మినెంట్‌, పనికి తగ్గ వేతనంతోపాటు మున్సిపల్‌ రంగంలోని ఇంజినీరింగ్‌ కార్మికులకు రిస్క్‌, హెల్త్‌ అలవెన్స్‌, పబ్లిక్‌ హెల్త్‌ పరిధిలో పనిచేస్తున్న చెత్త తరలించే వాహన డ్రైవర్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, మలేరియా, పార్కులలో పనిచేసే కార్మికులకు ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్స్‌, వాటర్‌ సప్లరు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ కార్మికులకు కార్మిక శాఖ ప్రతిపాదనల మేరకు జీతాల చెల్లింపు చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నేతలు సిద్దయ్య, శిద్దముల్లు, అశోక్‌, రవికుమార్‌, వై.వెంకటరమణ, మంగమ్మ, రమణమ్మ పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : పారిశుధ్య కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా పురపాలక కార్యాలయం వద్ద కార్మికులు వైష్ణవ నామాలు ధరించి గోవింద నామాలు ఉచ్చరిస్తూ గోవిందుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి బుద్దిని ప్రసాదించి తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ ఓబయ్య, కార్మికులు లక్ష్మీదేవి, రమణ, ప్రసాద్‌, రమేష్‌ పాల్గొన్నారు.

➡️