ఆటలే ముఖ్యమా…ఆందోళనలు పట్టవా…

Dec 25,2023 22:58
ఆడుదాం ఆంధ్ర

నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’
ఓ వైపు అంగన్‌వాడీలు, ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మె
నేటి నుంచి వారి బాటలోనే మున్సిపల్‌ కార్మికులు
అయినా పట్టించుకోని సర్కారు
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి

పదిహేను రోజులుగా అంగన్‌వాడీలు నిరవధిక సమ్మెలో ఉన్నారు. సమగ్రి శిక్ష ఉద్యోగులూ అదే బాట పట్టారు. నేటి నుంచి మున్సిపల్‌ కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది సైతం నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. ఉద్యోగుల, ఉపాధ్యాయులు సమస్యలు పోరాడుతూనే ఉన్నారు. కాని ఇవేమీ పట్టనట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సమస్యలను పరిష్కరించకుండా ‘ఆడుదాం ఆంధ్ర’ను పట్టుకుని వేలాడుతోంది. ఎలాగైనా దీన్ని విజయవంతం చేయాలని ఆదేశాలు సైతం జారీ చేసింది. ఎంపిడిఒలు, మున్సిపల్‌ కమిషనర్లకు ‘ఆడుదాం ఆంధ్ర’ పర్యవేక్షణ బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. అంగన్‌వాడీ టీచర్లు, పొదుపు సంఘాలు, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలోఒ్ల అర్హులైన వారిని రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వాలంటీర్లు తీవ్ర ఒత్తిడి తెచ్చారనే విమర్శలున్నాయి. లేకుంటే అమ్మఒడి, జగనన్న చేయూత, జగనన్న తోడు, జగనన్న విద్యా వసతి దీవెన లాంటి పథకాలకు అనర్హులవుతారని వాలంటీర్లు భయభ్రాంతులకు గురి చేశారని పలువురు చెబుతున్నారు. జిల్లాలోని 19 మండలాల్లో 1,74,953 మంది క్రీడాకారుల పేర్లు నమోదు చేశారు. పురుషులు 1,07,184 కాగా మహిళలు 67,769 మంది ఉన్నారు. క్రికెట్‌ పోటీలకు 66,009 మంది, బాడ్మింటన్‌ పోటీలకు 19,239 మంది, వాలీబాల్‌ పోటీలకు 35,422 మంది, కబడ్డీకి 35,939, ఖోఖోకు 36,063 మంది హాజరు కానున్నట్లు క్రీడాప్రాధికార సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. గ్రామ, వార్డు ప్రతి సచివాలయ పరిధిలో 250 మంది పేర్లు నమోదు లక్ష్యంగా వాలంటీర్లకు బాధ్యతలు అప్పగించారు. ప్రజల్లో ఆసక్తి ఉత్సాహం ఉన్నా లేకున్నా ఆడాల్సిందే అని ఎట్టకేలకు లక్ష్యాన్ని పూర్తి చేశారు. ప్రజలను ఆకట్టుకునేందుకు వేసిన ఓ ఎత్తుగడలో భాగంగానే నగదు బహుమతులను ప్రకటించారనే విమర్శలు విన్పిస్తున్నాయి.ఆటలు సరే.. సమస్యల సంగతేంటి?అంగన్‌వాడీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరిస్తామని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే వేతనం కంటే వేయి అదనంగా ఇస్తామని వాగ్దానం చేసి నాలుగేళ్లయినా అమలు చేయలేదు. దీంతో ఆందోళనకు దిగారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, భద్రత కల్పించాలని ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. వీరు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు కొనసాగించాలని, మహిళలకు మెటర్నిటీ సెలవులు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే.. ఆ కుటుంబంలో మరొకరికి ఉద్యోగంతో పాటు ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలు ఇవ్వాలని, ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేయాలని కోరుతున్నారు. ఉద్యోగులలో అత్యధిక సంఖ్యలో ఉండే ఉపాధ్యాయులు సైతం సిపిఎస్‌ రద్దు చేయాలని ఇప్పటికే దశల వారీ ఆందోళనలను నిర్వహిస్తున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, విఆర్‌ఎలు, మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌, మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం పరిష్కార దిశగా చొరవ చూపటంలేదు. ఆటలపై ఆసక్తి చూపకున్నా వాలంటీర్లపై ఒత్తిడి తెచ్చి మరీ పేర్లు రిజిస్ట్రేషన్‌ చేయించింది. నేటి నుంచి ఆడుదాం ఆంధ్రాకు సన్నద్దమైంది.ఈ పరిస్థితుల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి రూ.100 కోట్ల బడ్జెట్‌ కేటాయించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆటలకు వ్యతిరేకం కాదని, అయితే ఎటూగాని సమయంలో ఆడుదాం ఆంధ్ర అంటూ ఇంత ఖర్చు పెట్టడం సబబు కాదనే వాదనలు ఉన్నాయి. మార్చి, ఏప్రిల్‌లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉత్తీర్ణత శాతం పెరగాలంటే ఉపాధ్యాయులకు విద్యార్థులపై పర్యవేక్షణ ఉండాలి. విద్యార్థులు ఆటలకు సమయం కేటాయించే పరిస్థితి కూడా ఉండదు. ఈ కాస్త సమయం పరీక్షలకు ప్రిపేర్‌ కావడానికి సరిపోతుంది. లేదంటే ఆ ప్రభావం ఫలితాలపై పడే అవకాశం లేకపోలేదని పలువురు అంటున్నారు.

➡️