‘ఆడుదాం ఆంధ్రా’ విజయవంతం చేయాలి

ప్రజాశక్తి – భీమడోలు

మండలంలో ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ‘ఆడదాం ఆంధ్రా’ టోర్నమెంట్‌-2023ను విజయవంతం చేయాలని ఎంపిడిఒ సిహెచ్‌.పద్మావతి దేవి కోరారు. భీమడోలు హైస్కూల్‌లో శనివారం కార్యక్రమ నిర్వహణపై బాధ్యులతో ఎంపిడిఒతో పాటు, తహశీల్దార్‌ ఎం.ఇందిరాగాంధీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని 17 గ్రామ సచివాలయాల నుంచి ఆటల్లో పాల్గొనేందుకు 1,980 మంది పురుషులు, 700 మంది మహిళలు తమ పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. వారికి ఐదు అంశాలలో వేరువేరుగా వార్డు, గ్రామపంచాయతీ, మండల స్థాయిలో పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికోసం 170 స్పోర్ట్స్‌ వాలంటీర్ల నియామకం జరిగిందన్నారు. గ్రామస్థాయిలో క్రీడా మైదానాలు అందుబాటులో లేనందున భీమడోలు హైస్కూల్‌లో ఆరు గ్రామ సచివాలయాలు, పూళ్ళ హైస్కూల్‌లో మూడు గ్రామ సచివాలయాలు, ఆగడాల లంక హైస్కూల్‌లో రెండు గ్రామ సచివాలయాలు, గుండుగొలను హైస్కూల్‌లో నాలుగు గ్రామ సచివాలయాల స్థాయిల్లో ఆటల పోటీలు నిర్వహించనున్నామన్నారు. ఒక్కొక్క గ్రామం నుంచి విభాగాల వారీగా రెండు టీంలు పోటీ పడేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. వీరిలో ఉత్తమ ప్రదర్శన చేసిన క్రీడాకారులను ఒక టీంగా చేస్తామన్నారు. వారు మండల స్థాయిలో జరిగే పోటీలకు గ్రామపంచాయతీ ప్రతినిధులుగా హాజరవుతారని తెలిపారు. ఇదే క్రమంలో వార్డు, గ్రామపంచాయతీ స్థాయి పోటీలు ఈనెల 26 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 9వ తేదీ వరకు, మండల స్థాయి పోటీలు వచ్చే సంవత్సరం జనవరి 10 నుంచి 23వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. చురుకైన జీవనశైలిని అలవర్చేందుకు, ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేందుకు క్రీడా పోటీలు దోహదపడతాయన్న లక్ష్యంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న క్రీడాకారులతో మాక్‌ ఆటల పోటీలను నిర్వహించారు. ఆపై ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై భీమడోలు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి భాస్కర్‌, భీమడోలు హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️