ఆడుదాం ఆంధ్ర విజేతలకు బహుమతులు

Feb 4,2024 00:23

విజేతలకు బహుమతులు ట్రోఫీని ఇస్తున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
ప్రజాశక్తి-గుంటూరు :
ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి, అత్యున్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్న మహో న్నత లక్ష్యంతో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎన్‌టిఆర్‌ స్టేడియంలో ఆడుదాం ఆంధ్రా పోటీల ముగింపు, విజేతలకు బహుమతి ప్రదానోత్సవంలో కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, జెసి జి.రాజకుమారి, జిఎంసి కమిషనర్‌ కీర్తి చేకూరి, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల సహాయ కార్పొరేషన్‌ చైర్మన్‌ ముంతాజ్‌ పఠాన్‌, రాష్ట్ర కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ మండేపూడి పురుషోత్తంతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 1,45,929 మంది క్రీడాకారులు పోటీలకు నమోదు చేసుకున్నారన్నారు. పోటీలను సక్రమంగా నిర్వహించిన సచివాలయ సిబ్బంది, మండల, జిల్లా స్థాయి అధికారులు, కోచ్‌లకు అభినందనలు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన జట్లు విశాఖ పట్టణంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామన్నారు. జిల్లా స్థాయి పోటీలలో క్రికెట్‌, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌కు క్రీడలకు మొదటి బహుమతి రూ.60 వేలు, రెండో బహుమతి రూ.30 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు, బాడ్మింటన్‌ మొదటి బహుమతి రూ.35 వేలు, రెండో బహుమతి రూ.20 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు అందజేశారు.

➡️