ఆత్మస్థైర్యంతో మరింత ముందుకెళ్లాలి

తాడికొండ : మహిళలు ఆత్మస్థైర్యం, నైపుణ్యత అలవర్చుకొని మరింత ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పూనమ్‌ మాలకొండయ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఆశించిందానికంటే ఎక్కువ ప్రగతి సాధించినా 34 శాతం మంది మహిళలు కుటుంబాన్ని-ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోలేక ఉద్యోగాన్ని విడిచి పెడుతున్నారని చెప్పారు. సవాళ్లను ఎదుర్కొంటు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదని, స్వయం ప్రతిపత్తితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఎవరైనా వారిని ఆపుతారానే స్థాయి నుంచి మమ్మల్ని ఎవరు ఆపేది అనే విధంగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. వర్సిటీ వీసీ డాక్టర్‌ ఆర్‌.శారద జయలక్ష్మి దేవి మాట్లాడుతూ వివిధ రంగాలలో ఎంతో కీర్తి గడించిన మహిళలను గుర్తు చేస్తూ వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. అనంతరం క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజేతలుగా నిలిచిన పరిపాలనా భవనం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, కాలేజ్‌ ఆఫ్‌ కమ్యూనిటీ సైన్స్‌కు చెందిన మహిళ ఉద్యోగులకు బహుమతి ప్రదానం చేశారు.

➡️