ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలి : సిపిఎం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రయివేట్‌ ఆసుపత్రుల్లో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించేలా ముఖ్యమంత్రి చొరవ చూపాలని సిపిఎం నగర కార్యదర్శి ఎ.రామమోహన్‌, జిల్లా కమిటీ సభ్యులు బి. దస్తగిరిరెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం నగరంలోని వివిధ ప్రయివేట్‌ ఆస్పత్రుల వద్ద ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేస్తున్నట్టు ప్రదర్శించిన ఫ్లెక్సీలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా అందిస్తున్న ఆరోగ్యశ్రీ, ఇహెచ్‌ ఎస్‌ సేవలను జనవరి 25 నుంచి నిలిపివేస్తున్నట్టు ఆసుపత్రుల యాజమాన్యాలు పేర్కొన్నాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ నెట్‌ వర్క్‌ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించ కపోవటం, గత జూన్‌ 23 నుంచి నిలిచిపోయిన బకాయిలు సుమారు రూ.1000 కోట్లకు చేరటం తదితర కారణాల వల్ల ఆరోగ్యశ్రీ నెట్‌ వర్క్‌ ఆసుపత్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవు తున్నాయన్నారు. దీనికి తోడు సుదీర్ఘకాలంగా ఆరోగ్యశ్రీ పథకం అమలులోని సమస్యలు పరిష్కారం కాకపోవటం, దశాబ్దకాలంగా వివిధ ప్రొసీజర్లు, సర్జరీల ప్యాకేజిలు పెంచకపోవటం వంటి కారణాల వల్ల ఆసుపత్రుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకానికి ఆసుపత్రులు తమ సొంత నిధులను ఖర్చుచేయటం ఇక ఎంత మాత్రం సాధ్యం కాదని వారు తెలిపారన్నారు. అందువల్ల ఆరోగ్యశ్రీ నెట్‌ వర్క్‌ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ నుంచి పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను తక్షణమే చెల్లించి, పేదలకు అందుబాటులో ఉండేలా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అటు ఆసుపత్రి యాజమాన్యాలు, ఇటు సామాన్య ప్రజలు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొ ంటున్నారని పేర్కొన్నారు. తక్షణమే ఆసుపత్రుల్లో బకాయి పడ్డ ఆరోగ్యశ్రీ బకాయిలన్నిటిని వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకుడు రామకష్ణారెడ్డి పాల్గొన్నారు.

➡️