ఆరోగ్య సురక్ష రెండో విడత ప్రారంభం

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి, అచ్చంపేట : ప్రజలకు నిరంతరం మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఆరోగ్య సురక్ష రెండో దశ వైద్య శిబిరాన్ని గుంటూరు రూరల్‌ మండలంలోని చినపలకలూరులో మంగళవారం ప్రారంభించిన మంత్రి మాటాకలడేతై రాష్ట్ర వ్యాప్తంగా 13,818 వైద్య శిబిరాలను నిర్వహించబోతున్నామని, గ్రామాల్లో ప్రతి మంగళవారం, శుక్రవారం వారానికి రెండేసి చొప్పున వైద్య శిబిరాలు జరుగుతాయని చెప్పారు. పట్టణాల వారీగా కూడా ప్రతి వారానికి రెండేసి సచివాలయాల పరిధిలో వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందుతున్న చికిత్సల సంఖ్యను 3,257కు పెంచామని, ఖర్చు మొత్తాన్ని రూ.25 లోలకు పెంచి కొత్త కార్డులను కూడా ఇంటింటికీ తిరిగి ఇస్తున్నామని చెప్పారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈఓ బాలజీ మాట్లాడుతూ వైఎస్సార్‌ కంటి వెలుగు అవ్వాతాతా కార్యక్రమంలో వైద్యచికిత్సలు చేయించుకున్న వారికి కంటి అద్దాలను అందిస్తామన్నారు. పలువురికి కళ్లజోళ్లుపంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, డీఎంఈ నర్సింహం, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ శ్రావణ్‌బాబు, ఆర్డీవో శ్రీకర్‌, జెడ్పీటీసీ టి.సుబ్బారావు, ఎంపీపీ ఐ.పద్మావతి, సర్పంచి ఎదురుపాక వెంకట్‌, ఎంపిడిఒ ఆదినారాయణ, తహశీల్దారు సాంబశివరావు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలోని చిగురుపాడులో కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో 495 వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల ద్వారా ఆరు నెలల్లో క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. చిగురుపాడు ఎంపిపి పాఠశాలలోని విద్యార్థినులకు ‘బంగారు తల్లి’ కార్డులను అందించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో తాజాగా ఒక కరోనా కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. ముందస్తుగా ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశామని, కరోనా కిట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఇదిలా ఉండగా తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌కు అంగన్వాడీలు వినతిపత్రం ఇచ్చారు.

➡️