ఆర్థిక కష్టాలు..కుటుంబ సమస్యలు..

Mar 27,2024 00:01

ఆసుపత్రిలో నాగమణి చంద్రశేఖర్‌ మృతదేహాలు (ఫైల్‌), మృతురాలు గీతాంజలి (ఫైల్‌ఫొటో)
ప్రజాశక్తి-తెనాలి : ఆర్థిక ఇబ్బందులు.. ఆస్తి తగాదాలు..కుటుంబ సమస్యలు…వ్యక్తిగత కారణాలు…ఇలా సమస్య ఏదైనా మనిషిని ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపిస్తుంది. సమస్యల సుడిలో చిక్కుకుంటున్న మనిషి మానసికంగా కుంగి పోతున్నాడా? అసలు ఆర్ధిక ఇబ్బందులకు కారణమేంటి? మనిషి బలవన్మరణమే సమస్యకు పరిష్కారమా? సాటి మనిషిని ఆందోళనకు గురిచేస్తున్న బలవన్మరణాలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. తెనాలిలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగా ఈనెల 13న పట్టణంలోని నాజరుపేటకు చెందిన చిరు వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో టీస్టాల్‌ నిర్వహించే విష్ణుమొలకల శివశంకరరావు, భార్య నాగమణి, కుమార్తె హారిక పురుగు మందు సేవించి ఆత్మహత్యా యత్నం చేశారు. నాగమణి(50) మృతి చెందగా, శివశంకరరావు, హారిక ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఈ ఘటనను పరిశీలిస్తే శివశంకరరావు పాల వ్యాపారం చేసేవాడు. ఆ వ్యాపారం లాభించకపోగా, అప్పుల్లోకి నెట్టడంతో రైల్వే స్టేషన్‌ కూడలిలో టీస్టాల్‌ నిర్వహిస్తున్నాడు. దీనికి తోడు కుమార్తె కాపురంలోనూ ఇబ్బందులు చోటు చేసుకోవటంతో భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన పి.చంద్రశేఖర్‌, నాగలక్ష్మి దంపతులు కూడా ఆర్ధిక ఇబ్బందులు, ఆస్తి వివాదాల నేపధ్యంలో సోమవారం రాత్రి పురుగు మంది సేవించి కొల్లిపర మండలం తూమూలూరులో అత్తగారింట ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగు మందు సేవించిన వారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించటంతో చంద్రశేఖర్‌ మృతి చెందగా, నాగలక్ష్మి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుంది. ఈ ఘటనలో కూడా ఆర్ధిక ఇబ్బందులు, ఆస్తి గొడవలు, కుమార్తె కుటుంబం చిన్నాభిన్నం కావటమే కారణం. ఈ రెండు ఘటనలు కాకతాళీయమే అయినా, రెండు ఘటనల్లోనూ ఒకటే కారణాలు స్పష్టమౌతున్నాయి. వీటన్నింటిని మించి సోషల్‌ మీడియా ప్రభావంతో మరో మహిళ ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కూడా ఈనెల 11న పట్టణంలో జరిగింది. సాలిపేటకు చెందిన గీతాంజలి(27) ఈనెల 4న జగనన్న కాలనీ పట్టా పొందింది. అదికూడా స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా అందుకుని, ఆ సంతోషాన్ని ఓ యూ ట్యూబర్‌ ద్వారా సోషల్‌ మీడియాలో పంచుకుంది. దీనిపై పాజిటివ్‌, నెగిటివ్‌ కామెంట్స్‌ సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఏదో తేదీన రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆయితే తీవ్రంగా గాయపడిన ఆమెను గుంటూరు వైద్యశాలకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ 11న మృతి చెందింది. ఈ ఘటన కూడా పెద్ద దుమారమే రేపింది. ఇలా వరుస ఘనటలు తెనాలి ప్రాంతంలోనే చోటు చేసుకోవటం చర్చనీయాంశమైంది. ఈ ఘటనల్లో ప్రశ్నార్ధకంగా మగిలే అంశాలున్నాయి. ఆధునిక జీవన శైలిపై పరుగులు పెట్టడం అప్పుల ఊబిలోకి నెడుతుందా. లేదా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్యుడు మనుగడ సాగించలేక అప్పులపాలై పోతున్నాడా? కుటుంబ పోషణకు ఎంచుకున్న చిన్నపాటి వ్యాపారాల్లో పోటీ ఆర్థికంగా కుంగదీస్తోందా? వ్యవసాయంలో యాంత్రీకరణ కారణంగా ఉపాది కోల్పోయి, కుటుంబం కోసం అప్పుల పాలవుతున్నారా? ఈ ప్రశ్నలన్నీ సామాన్యుల మదిని తొలిచేస్తున్నాయి. ప్రభుత్వాలు సామాన్యుల జీవన శైలి మెరుగుకు కొంతైనా భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.

➡️