ఆర్‌బికె, సచివాలయ భవనాలు ప్రారంభం

Feb 13,2024 21:03

ప్రజాశక్తి – మక్కువ : మండలంలోని పనసభద్ర, చప్పబుచ్చంపేట, సరాయివలస గ్రామాల్లో రైతు భరోసా కేంద్రం, సచివాలయాల భవనాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర మంగళవారం ప్రారంభించారు. గ్రామాలకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రిని గ్రామస్తులు సాంప్రదాయ నృత్యాలతో ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువ కావడానికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. రైతుల చెంతకు విత్తనాలు, ఎరువులు అందజేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అధునాతన వ్యవసాయం చేసేందుకు డ్రోన్లను అందించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో 12 మందికి డ్రోన్లు ఉపయోగించడంలో శిక్షణ ఇచ్చామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఇళ్ల రిజిస్ట్రేషన్లను చేయడం జరుగుతోందని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మావుడి శ్రీనివాసనాయుడు, మండల వైసిపి అధ్యక్షులు మావుడి రంగునాయుడు, ఎంపిడిఒ దేవకుమార్‌, తహశీల్దార్‌ సింహాచలం, ఇతర ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️