ఆశావాహినిని… ఆశీర్వదించండి

Feb 2,2024 21:24

ప్రజాశక్తి – మక్కువ : సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్‌ ఆశిస్తూ వచ్చానని, మీ అందరి ఆశీర్వాదాలు కావాలని, ఉద్యోగం వదులుకొని ప్రజాసేవకు వచ్చానని ఆశావాహి ఎం.తేజోవతి అన్నారు. మండలంలోని ఓ కల్యాణ మండపంలో మండల మాజీ టిడిపి అధ్యక్షులు పెంట తిరుపతిరావు అధ్యక్షతన మండలంలోని వివిధ పంచాయతీల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కుటుంబం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తూ వచ్చిందన్నారు. ఇటీవలే ఉపాధ్యాయ వృత్తి నుండి 25 ఏళ్ల సర్వీస్‌ ఉన్నప్పటికీ వదులుకొని ప్రజాసేవ చేయాలను ఉద్దేశంతో పార్టీలో చేరానని ఆమె అన్నారు. సాలూరు నియోజకవర్గంలో టిడిపి తరఫున రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండలంలోని తిరుపతిరావు నేతృత్వంలో అందరి అభిప్రాయాలు పంచుకుంటూ ముందుకు వెళ్తానని అన్నారు. ఒకవేళ టిక్కెట్టు మరొకరికి ఇచ్చినా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని అన్నారుముత్యాలమ్మ? పోలమాంబ?ఎక్కడైనా సిద్ధం!సాలూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గుమ్మడి సంధ్యారాణి తనపై చేసిన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడానని, అలాగే కోట్లాది రూపాయలు వెనకేసుకున్నానని ఆరోపణలకు మండలంలో ఉన్న పార్టీ శ్రేణులకు అంతా తెలుసునని మండల మాజీ టిడిపి అధ్యక్షులు పెంట తిరుపతిరావు అన్నారు. తాను 2019లో పార్టీ మారడానికి గల కారణాలు అందరికీ తెలుసునన్నారు. అప్పట్లో వైసిపి నాయకులు స్థానికంగా అట్రాసిటీ కేసులు పెట్టేందుకు ప్రయత్నించగా అప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న సంధ్యారాణి కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక వైసిపి నేతలతో లోపాయికారిగా చేతులు కలిపి వికాటహాసం చేశారన్నారు. 2019 ఎన్నికల్లో వైసిపితో అనైతికంగా లాలూచీపడి రెండు కోట్ల రూపాయల వరకు దండుకున్నారని ఆరోపించారు. మామిడిపల్లిలో టిడిపి ఇచ్చిన నిధులు ఖర్చు చేయలేదంటూ కొంత సొమ్ము స్వాహా చేశారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ప్రస్తుతం టిడిపి అధిష్టానం చేపడుతున్న ఐవిఆర్‌ఎస్‌ సర్వేలో తేజోవతి పేరు కూడా అడుగుతున్నారని, అలాంటప్పుడు ఆమెకు పార్టీతో సంబంధం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌ ఇప్పటికే తేజోవతి కోసం చివరి వరకు సాలూరు టికెట్‌కు ప్రయత్నిస్తానని చెప్పారని ఆయన మాట ప్రకారం తాము కూడా తేజోవతికి మద్దతు తెలుపుతామన్నారు. సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, ఇతర పార్టీ శ్రేణులంతా తమ వైపు ఉన్నారని, ఎవరూ లేరంటూ వీరందరికీ పార్టీతో సంబంధం లేదంటూ చేసిన తప్పుడు ఆరోపణ లపై ముత్యాలమ్మ తల్లి లేదా శంబర పోలమాంబ ఆలయాల వద్ద ప్రమాణానికి సిద్ధమేనని ఆయన సవాల్‌ విసిరారు.డిపాజిట్‌ రాని వారికి అధ్యక్ష పదవా..?స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా రాని వ్యక్తి సర్పంచ్‌ స్థానానికి కూడా పోటీ చేయలేని గుళ్ల వేణుగోపాలనాయుడుకు మండల టిడిపి అధ్యక్ష పదవి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని విమర్శించారు. వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తూ టిడిపికి స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేశారని ఆయన ఆరోపించారు. వారిని వెనుకేసుకొస్తూ సంధ్యారాణి కాంగ్రెస్‌ మార్కు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆధారాలతో జాతీయ నాయకత్వానికి తెలియజేస్తామన్నారు.

➡️