ఆశా వర్కర్లతో గొడ్డు చాకిరీ

నరసరావుపేటలో భారీ ప్రదర్శనకు వచ్చిన ఆశా కార్యకర్తలు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : భారీ ర్యాలీ, జెసికి వినతిపత్రంతో ఆశా కార్యకర్తల 36 గంటల నిరసన శుక్రవారం ముగిసింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశా కార్యకర్తలు ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ధర్నాచౌక్‌ వద్ద గురువారం నుండి నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 800 మందికి పైగా ఆశాలు స్థానిక ధర్నాచౌక్‌ వద్ద నుండి కలెక్టరేట్‌ వరకూ భారీ ప్రదర్శన చేశారు. ప్రదర్శనతో ఆ మార్గం కిక్కిరిసింది. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌కు యూనియన్‌ నాయకులు వినతి పత్రాన్ని ఇచ్చి సమస్యలను వివరించారు. జెసి స్పందిస్తూ… సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తక్కువ గౌరవ వేతనాలతో ఆశా కార్యకర్తలు అందిస్తున్న సేవలు అభినందనీయమని చెప్పారు.తొలుత ధర్నాచౌక్‌లో నిరసనకు యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.రత్నకుమారి అధ్యక్షత వహించారు. వివిధ సంఘాల వారు వీరికి మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలన్నారు. దీనిపై ఎన్నాళ్లుగానే పోరాడుతున్నా దున్నపోతు మీద వానపడినట్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన సలహాలిస్తూ, సేవలందించే ఆశాలు, అంగన్వాడీలు ఆరోగ్యంగా ఉండాలంటే వారు పౌష్టికాహారం తినవసరం లేదా? అని అందుకు కనీస వేతనాలు అవసరం లేదా? అని ప్రశ్నించారు. కనీస వేతనం, పెన్షన్‌, ఇఎస్‌ఐ ఇవ్వాలనే సుప్రీంకోర్టు ఆదేశాల అమలునే తాము కోరుతున్నామని చెప్పారు. స్కీం వర్కర్లతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని, ఇటీవల జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆశాలు కీలకంగా పని చేశారని చెప్పారు. ఇదే క్రమంలో పని ఒత్తిడితో ఒక కార్యకర్త గుండెపోటుకు గురై మృతి చెందగా యూనియన్‌ పోరాడి ఆర్థిక సాయాన్ని సాధించిందని చెప్పారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు డి.శివకుమారి మాట్లాడుతూ సమస్యలను పరిష్కరిస్తారో.. అధికారం నుండి దిగిపోతారో ప్రభుత్వం తేల్చుకోవాలన్నారు. కోవిడ్‌ కాలంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన ఆశా కార్యకర్తలకు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కల్పించాలని, ఆన్‌లైన్‌ వర్క్‌ పేరుతో పనిభారం, వేదింపులు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణలో కెసిఆర్‌కు పట్టిన గతే ఇక్కడ జగన్‌కు పడుతుందని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా కార్యదర్శులు ఎ.లక్ష్మీశ్వరరెడ్డి, ఏపూరి గోపాలరావు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులంటూ ఆశాలకు సంక్షేమ పథకాలను దూరం చేసిన ప్రభుత్వం వేతనాలు ఇచ్చేటప్పుడు గౌరవవేతనంతోనే ఎందుకు సరిపెడుతోందని ప్రశ్నించారు. వారికీ పిఆర్‌సి, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ అమలు చేయాలని, రిటైర్‌మెంట్‌ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని, చనిపోయిన ఆశా కార్యకర్త కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నరసరావుపేట మండల అధ్యక్షులు షేక్‌ సిలార్‌ మసూద్‌, యూనియన్‌ నాయకులు ఎం.భూలక్ష్మి, ధనలక్ష్మి, కె.బుజ్జి, పి.బుజ్జి, కోటేశ్వరి పాల్గొన్నారు.

➡️