ఆశీర్వదించండి.. సమస్యలు పరిష్కరిస్తా

ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలోని వీరన్నబావి వీధిలో సీతారాముల వారి ఆలయంలో ఆర్యవైశ్య సోదరుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డికి పూలమాలలు, శాలువాలతో ఘన స్వాగతం పలికారు. ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అశోక్‌రెడ్డి వారితో మాట్లాడుతూ గతంలో తాను గిద్దలూరు పట్టణంలో ఎంతో అభివృద్ధి చేశానని, తాగునీటి సమస్యను పరిష్కరించానని, సిమెంట్‌ రోడ్లు, పెన్షన్లు, రేషన్‌ కార్డులు, మంజూరు చేశానని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సహాయం చేశానని అన్నారు. ‘నేను ఎల్లప్పుడూ గిద్దలూరులోనే నివాసం ఉంటా.. మీ ఇంటి బిడ్డగా మీకు ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తా.. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తనకు మద్దతిచ్చి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి’ అని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు చీతిరాల నాగార్జున, శివపురం అనంత రామయ్య, శివపురం వెంకటరామయ్య, చీతిరాల రవి, ప్రసాద్‌, విట్టా సుబ్బారావు, విట్టా రాజారావు, విట్టా సుబ్బరత్నం, దమ్మాల నాగయ్య, గంగిశెట్టి రామయోగయ్య, నటుకుల శ్రీను, గర్రె సాయినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️