ఆసక్తి ఉంటే అందరూ కవులే

Mar 18,2024 00:15

శ్రీనివాసరెడ్డి, ప్రభుదాసును సత్కరిస్తున్న రావి రంగారావు తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు :
ఆసక్తి ఉంటే అందరూ కవులే అని డాక్టర్‌ రావి రంగారావు అన్నారు. స్థానిక బ్రాడీపేట సర్వీస్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ సమావేశ మందిరంలో ఆదివారం ‘అమరావతి సాహితీ మిత్రులు’ నిర్వహించిన సాహిత్య సభలో ఆయన ‘అందరూ కవులు కావచ్చు’ అనే అంశంపై మాట్లాడారు. ప్రతివ్యక్తీ ఎంతో కొంత కవిత్వం మాట్లాడుతూనే ఉంటాడని, కానీ ఆ విషయం అతనికి తెలియదని చెప్పారు. పల్లెల్లో నిరక్షరాస్యుల సంభాషణల్లోనూ కవిత్వం కనిపిస్తుందని అన్నారు. ఆసక్తి ఉంటే చదువురాని వారు కూడా కవిత్వం చెప్పటం నేర్చుకోవచ్చని, గొప్ప కవిత్వం రాయవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా సి.ఎస్‌.రావు రచించిన ‘అక్షర మేఘాలు’ కవిత్వ సంపుటిని వి.వి.రావు విశ్లేషించారు. గోటేటి లలితా శేఖర్‌ రచించిన ‘పుడమి తల్లి నేస్తం’ కథానికల సంపుటి గురించి ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ మైలవరపు లలితకుమారి వివరించారు. సభలో ఈ మాసం కవిగా డాక్టర్‌ దేవరపల్లి ప్రభుదాస్‌ పాల్గొని కవితలు వినిపించారు. సంస్థ కన్వీనర్‌ పింగళి భాగ్యలక్ష్మి నిర్వహించిన కవి సమ్మేళనంలో ఎం.మాధవి, సత్యవతి, షేక్‌ కాసింబి, ఎం.శ్రీనివాసరెడ్డి, ఎస్‌.రవికుమార్‌, కె.జయకుమార్‌, ఎస్‌.కనకదుర్గ, టి.ధనుంజయరెడ్డి, ఎన్‌.పూర్ణప్రజ్ఞాచారి, సిహెచ్‌.వెంకటరత్నం, ఆర్‌.రాజ్‌ కృష్ణ, సురేష్‌బాబు, శేషుమాంబ, జి.బసవజు తదితరులు కవితలు వినిపించారు. ‘నిక్కచ్చి కవిత’గా ఎంపికైన మెట్టు శ్రీనివాసరెడ్డిని, ఈ మాసం కవి ప్రభుదాసును సత్కరించారు. డాక్టర్‌ సూర్యదేవర రవికుమార్‌, సిహెచ్‌. వెంకటరత్నం, పాణిరావు యర్రగుంట్ల పర్యవేక్షించారు.

➡️