ఆస్తి కోసం కత్తి దూసిన దత్తపుత్రుడు

Feb 21,2024 23:38

ఘటనా స్థలిని పరిశీలిస్తున్న పోలీసులు
ప్రజాశక్తి-పిడుగురాళ్ల :
జాగ్రత్తగా కాపాడతాడు అనుకున్న దత్తకుమారుడే కాలయముడుగా మారాడు. జాగ్రత్తగా పెంచిన తల్లిదండ్రులపై ఆస్తికోసం కత్తి దూశాడు. ఈ దారుణ ఘటనతో పిడుగురాళ్ల పట్టణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పోలీసుల వివరాల ప్రకారం… పట్టణంలోని 12వ సచివాలయం పక్కన నివాసం ఉంటున్న నీటిపారుదల శాఖలో లస్కర్‌గా రిటైర్‌ అయిన మచ్చు యోహాను (64), చిట్టెమ్మ దంపతులకు పిల్లలు లేకపోవడంతో సోదరుని కుమారుడైన అంబేడ్కర్‌ను దత్తత తీసుకున్నారు. చిన్నప్పటి నుండి సొంతబిడ్డలా చూసుకోవడంతోపాటు పెళ్లి కూడా చేశారు. ఒకే భవనంలో కింది అంతస్తులో యోహాను దంపుతులు ఉంటుండగా, పై అంతస్తులో అంబేద్కర్‌ తన కుటుంబంతో ఉంటున్నాడు. వ్యసనాలకు బానిసైన అంబేద్కర్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకలోనూ పలుమార్లు చోరీలకు పాల్పడి జైలుకూ వెళ్లి వచ్చాడు. ఎంత చెప్పినా అంబేద్కర్‌ ప్రవర్తన మారకపోవడంతో కొంతకాలంగా యోహాను దంపతులు అతనితో మాట్లాడ్డం మానేశారు. దీంతో ఆస్తి తనకు దక్కదేమోనని భావించిన అంబేద్కర్‌…. యోహాను దంపతులపై తరచూ గొండవ పెట్టుకుంటున్నాడు. ఆస్తిని తన పేరున రిజిస్ట్రేషన్‌ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మరోసారి గొడవపెట్టుకుని యోహాను దంపతులపై దాడి చేయబోగా వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన్ను పోలీసులు స్టేషన్‌కు పలిపించి మందలించి పంపించారు. దీంతో ఇంకా కోపం పెంచుకున్న అంబేద్కర్‌ బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటి పక్కన ద్విచక్ర వాహనాన్ని పార్క్‌ చేస్తున్న యోహానుపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేయగా యోహాను అక్కడిక్కడే మృతి చెందాడు. వెంటనే ఇంట్లో ఉన్న తల్లి చిట్టెమ్మపైనా దాడి చేయగా ఆమె పెనుగులాడి అరుకుకుంటూ బయటకు పరుగులు తీసింది. దీంతో అక్కడున్న వారు ఆమెను కాపాడి అంబేద్కర్‌ను వారించారు. ఈ సందర్భంలోనూ అక్కడి వారిని అంబేద్కర్‌ కత్తి చూపి బెదిరించి తల్లిపై మరోసారి దాడి దాడి చేస్తుండగా స్థానిక యువత రాళ్లతో అంబేద్కర్‌పై దాడి చేశారు. దీంతో ఆయన చిట్టెమ్మను వదిలేసి పరారవుతుండగా యువకులు వెంబడించారు. కొద్ది దూరంలో ఉన్న ఓ ఇంటిపైన గదిలోకి అంబేద్కర్‌ వెళ్లగా యువకులు ఆ గది తలపులు మూసి పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సిఐ ఆంజనేయులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగారతురాలు చిట్టెమ్మను స్థానిక వైద్యశాలకు తరలించారు. యోహాను మృతదేహాన్ని డీఎస్పీ పల్లపు రాజు పరిశీలించి పోస్టుమార్టుం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అంబేద్కర్‌పై గతంలో పలు నేరాలకు సంబంధించి 46 కేసులున్నట్లు సిఐ తెలిపారు.

➡️