ఇంటి కోసం, సెంటర్‌ కోసం అప్పులతో తిప్పలు

సత్తెనపల్లి ఆర్‌డిఒకు వినతిపత్రం ఇస్తున్న అంగన్వాడీలు, నాయకులు
ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌, దాచేపల్లి : సెంటర్ల నిర్వహణకు, కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సిన దుస్థితిలో ఉన్నామని, తివ్ర పనిఒత్తిడితోపాటు ఆర్థిక అవస్థలనూ నిత్యం అనుభవిస్తున్నామని అంగన్వాడీలు ఆవేదన వెలిబుచ్చారు. వారం రోజుల నుండి చేస్తున్న సమ్మెలో భాగంగా సోమవారం సత్తెనపల్లి, గురజాలలో భారీ ప్రదర్శనలు చేశారు. అనంతరం ఆర్‌డిఒ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసి అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి తమ ఆవేదనలను వివరించారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి ధర్నాలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పల్నాడు జిల్లా కార్యదర్శి కార్యదర్శి జి.మల్లీశ్వరి మాట్లాడుతూ తెలంగాణలో కంటే అధికంగా ఆంధ్రలోని అంగన్వాడీలకు జీతాలు ఇస్తామని ప్రతిపక్షనేతగా జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలప్పుడు హామీనిచ్చారని, ఇప్పటికీ ఆ మాట ఉత్త మాటగానే మిగిలిందని ఆవేదన వెలిబుచ్చారు. మాట తప్పను.. మడమ తిప్పను అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. రోజు రోజుకూ పెరుగుతున్న ధరలతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ఎదురు డబ్బులు పెట్టాల్సి వస్తోందని, 2017 నుండి టిఎ బిల్లులు రాలేదని తెలిపారు. చిత్తశుద్ధిలేని చర్చలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.రవిబాబు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన కోర్కెలు తీర్చటానికి ప్రభుత్వం వద్ద నిధుల్లేవంటూ మంత్రులు చెబుతున్నారని, మరోవైపు ఎన్నికల హామీలు నూరు శాతం నెరవేర్చామంటూ ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. అంగన్వాడీలకు అత్తెసరు జీతాలిస్తూనే సంక్షేమ పథకాల్లో కోత పెట్టారని, భద్రత లేని ఉద్యోగాలు, చాలీచాలని జీతాలతో జీవన పోరాటం చేస్తున్న అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. లేకుంటే ఉద్యమం మరింత ఉధృతమవుతుందన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.మహేష్‌, ఆర్‌.పురుషోత్తం, జె.రాజ్‌కుమార్‌, ఐద్వా జిల్లా కార్యదర్శి జి.రజిని, నాయకులు జి.ఉమశ్రీ, డి.విమల, యూనియన్‌ నాయకులు జి.శివపార్వతి, జయలక్ష్మి, ధనలక్ష్మి, చాముండేశ్వరి, అంజలి, శివనాగమల్లేశ్వరి, భవాని, రహీమున్నిసా, విజయకుమారి, లీలావతి, శ్రీలక్ష్మి ఉన్నారు.

గురజాలలో ఆర్‌డిఒ కార్యాలయానికి నిరసన ప్రదర్శనగా వెళ్తున్న అంగన్వాడీలు
గురజాల ధర్నా చేసి ఆర్‌డిఒ రమాకాంత్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. అంగన్వాడీలకు మద్దతుగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏవూరి గోపాలరావు మాట్లాడుతూ అంగన్వాడీలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి వారి డిమాండ్లను అంగీకరించాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వం చీమ కుట్టినట్లుగా కూడా స్పందించడం లేదని, ఇదే తీరు కొనసాగితే సిఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడదిస్తామని హెచ్చరించారు. అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి.శ్రీనివాసరావు మాట్లాడారు. యూనియన్‌ నాయకులు ఉష, మహాలక్ష్మి, మల్లీశ్వరి, సైదమ్మా, శివకుమారి, రుక్మిణి, దేవకుమారి, రత్నం, నాగకుమారి, ప్రమీల, మల్లేశ్వరి, జ్యోతి, సుమతి, షేక్‌ హాజ్రా, డి.శాంతామణి, బుజ్జి, వెంకటరమణ, కవిత, పద్మ, అరుణ, రాధికా పాల్గొన్నారు.

➡️