ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా బెన్నవోలు యువకుడు

కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టిని కలిసిన మజ్జి వెంకటసాయి

ప్రజాశక్తి- చోడవరం

మండలంలోని మారుమూల బెన్నవోలు చెందిన మజ్జి వెంకటసాయి దేశ రక్షణ రంగం ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో యుద్ధ విమానాలు నడిపే ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ స్థాయికి ఎదిగారు. ఈ మేరకు వెంకటసాయిని మంగళవారం కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి అభినందించారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన మజ్జి వెంకటసాయి ప్రాథమిక విద్యాభ్యాసం పట్టణంలోని రవి కాన్వెంట్లో సాగింది. తరువాత విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్‌ స్కూల్లో 12వ తరగతి వరకూ చదివారు. అనంతరం 2019లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు ఎంపికయ్యారు. ఎయిర్‌ ఫోర్సులో యుద్ధ విమానం పైలట్‌గా నాలుగు సంవత్సరాలు శిక్షణ పూర్తి చేసుకున్న వెంకట సాయి ఇటీవలే హైదరాబాదులోని దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో చివరి విడత శిక్షణ పూర్తి చేసి ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా బెంగళూరులో విధుల్లో చేరారు. వెంకట సాయి తల్లిదండ్రులు మజ్జి లక్ష్మి, గౌరీ శంకరు. తండ్రి గౌరీశంకర్‌ వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. తమ్ముడు దుర్గ ప్రసాద్‌ ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నారు. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి ఆర్మీలో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ క్యాడర్‌కు వెంకట సాయి ఎదగడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఉమ్మడి జిల్లాల నుంచి ఈ పోస్ట్‌కు ఎంపికైంది వెంకట సాయి ఒక్కరే కావడం విశేషం.

➡️