ఇదేనా అడుగు(ర)జాడ

Nov 30,2023 21:13

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :   గురజాడ… పేరు వినగానే ప్రపంచం ఫరిడవిల్లుతుంది. ఆయన అభ్యుదయ సమజానికి దిక్చూచి. అందుకే సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు మొదలుకుని సమాజ హితం కోరుకునే అభ్యుదయవాదులంతా ఆయన కవితలు, కథలు, కావ్యాలను గుర్తు చేస్తుంటారు. ఆయన బాటలో నడవాలని హితబోధ చేస్తుంటారు. బహుశా అందుకేనేమో విజయనగరం పేరు చెప్పగానే చాలా మంది నోటి ప్రతిధ్వనించేది గురజాపేరే. కానీ, ఆయన జాడను అనుసరించే పాలకులు, అధికారులు మన జిల్లాలో కరువయ్యారు. ఏటా గురజాడ జయంతి, వర్థంతి ప్రాధాన్యత తగ్గిపోతుండగా, ఈ ఏడాది ఏకంగా ఆయన వర్థంతి రోజున స్మరించుకునేవారే కరువయ్యారు. కనీసం గురజాడ చిత్రపటం, విగ్రహాలకు దండవేసి, ఆశయాలను పదిమందికి పంచే తీరిక లేకుండా పోయింది. దేశమును ప్రేమించుమన్నా… మంచి అన్నది పెంచుమన్న అన్నాడు మహాకవి గురజాడ. దేశమంటే మట్టికాదోరు…దేశమంటే మనుషులోరు… అంటూ విశ్వమానవాళికి కనువిప్పు కలిగించాడు. వొట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేల్‌ తలపెట్టవోరు అంటూ ఉద్భోదించాడు. ఇలా ఒకటా రెండా పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే నాటక రచనతో నాటి కన్యాశుల్కం తదితర సాంఘిక దూరాచారాలను చెండాడు. ఎల్లలోకములెల్ల ఒక ఇళ్లై… వర్ణభేదములెళ్ల అంటూ ప్రపంచమంతా ఒక్కటిగా ఉండాలని చాటి చెప్పాడు. ఇలా ఉంటే మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటె మిగిలిపోవును అని ఎంతో దూర దృష్టితో సమాజాన్ని మొల్కొల్పిన సంఘసంస్కర్త. ఈ నేపథ్యంలో గురజాడ ఘనకీర్తి ఎల్లలు దాటిందనడంలో సందేహం లేదు. ఎప్పుడో 19, 20 దశకాల్లో ఆయన రాసిన గేయాలు సజీవంగా, సమాజానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఉన్నాయంటే సమాజం పట్ల ఆయనకున్న ముందు చూపు ఎంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతటి మహాకవి గురజాడ వెంకట అప్పారావు తన సాహిత్య ప్రస్థానమంతా ఇక్కడి నుంచే సాగడంతో ఒకరకంగా చెప్పాలంటే విజయనగరం ప్రత్యేకతగానే చెప్పుకోవచ్చు. అందువల్లే గురజాడ పేరున అనేక కళా, సాహిత్య, విద్యాసంస్థలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా ఆయన జయంతి, వర్థంతి సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యాన సాహిత్యపోటీలు, సాహితీ సభలు నిర్వహించేవారు. గురజాడ దార్శినికతను జొప్పించేందుకు విద్యార్థులకు వ్యాసరచనపోటీలు కూడా నిర్వహించి, ప్రోత్సాహకాలు అందజేయం ఒకప్పుడు ఆనవాయితీగా ఉండేది. ఈ క్రమంలోనే ఏటా వర్థంతి రోజు నవంబర్‌ 30న గురజాడ సాహిత్యాన్ని జనంలోకి తీసుకెళ్లే కవులు, సాహితీవేత్తలకు ప్రభుత్వం తరపున గురజాడ సాహితీ పురస్కారం అందజేసేవారు. ఇది ఒకప్పటి మాట. కొన్నేళ్లుగా గురజాడ వర్థంతి, జయంతి మొక్కుబడిగానూ, సాహితీ పురస్కారం అలంకార ప్రాయంగాను మూరుతున్నాయి. జగమంతా కలిసివుండాలనే మహాకవి గురజాడ భావజాలానికి భిన్నంగా మతఛాందసత్వాన్ని, కట్టుబాట్ల పేరిట స్త్రీ అణిచివేతను బలంగా జనాల్లోకి తీసుకెళ్లే ఓ వ్యక్తికి నగరానికి చెందిన గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఏకంగా పురస్కారం అందజేయడం వివాదంగానే మారింది. ఈ ఏడాది ఏకంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు వర్థంతి నిర్వహించే తీరిక లేకుండా పోయింది. ఏటా కలెక్టర్‌ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా సాగుతున్నా ఈ ఏడాది విస్మరించారు. ఇందులో ప్రజాప్రతినిధులు పాల్గొనే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఎన్నికల రాజకీయాలతో పూర్తిగా మర్చిపోయారు. ఇటీవల కాలంలో సామాజిక న్యాయం అంటూ గొంతు ఎండి పోతున్నట్టు ప్రసంగాలు గుప్పిస్తున్న ప్రజాప్రతినిధులు…. ఇప్పటికైనా ఒట్టిమాటలు కట్టిపెట్టి…గట్టిమేల్‌ తలపెట్టవోరు అన్న గురజాడ స్ఫూర్తిని ఆచరించి, భావితరాలకు అందిస్తారని ఆశిద్దాం.

➡️