ఇదేనా రైతులపై చిత్తశుద్ధి?

Feb 10,2024 21:24

ప్రజాశకి – విజయనగరం ప్రతినిధి :  రైతుల సంక్షేమం, వ్యవసాయరంగ అభివృద్ధిపై మాటలు కోటలు దాటుతున్నా ఆచరణ గడపదాటడం లేదు. వారి సంక్షేమం, అభివృద్ధి సంగతి కాస్త పక్కనబెడితే, వ్యవసాయరంగం కోసం తలపెట్టిన సాగునీటి కాలువల ఏర్పాటులో కనీసం నీటివాటం కూడా తెలియని, తెలుసుకోలేని, పట్టని పరిస్థితుల్లో ఉన్నారు మన పాలకులు. హా… రైతులా పోతే పోనీ… అనుకున్నారో లేక వారి గురించి ఆలోచించడం వల్ల మనకేమిటి? అనుకున్నారో గానీ సుజల స్రవంతి కాలువ అలైన్‌మెంట్‌ మార్పు చేయాలంటూ రైతాంగం ఏడాదిగా మొత్తుకుంటున్నా అధికార పార్టీకి చెందిన నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు పట్టడం లేదు. సుజల స్రవంతి కాలువ ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలకు 8లక్షల ఎకరాలకు సాగునీరు, 2.30లక్షల జనాభాకు రోజుకు 4.46టిఎంసిల తాగునీటితోపాటు మొత్తం సాగునీటిలో 1శాతం నీటిని పారిశ్రామిక అవసరాలకు అందించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందులో అత్యధికంగా సుమారు 3.94లక్షల ఎకరాల మేర ఉమ్మడి విజయనగరం జిల్లాకు రావాల్సి వుంటుంది. ఇందులో భాగంగా ఈ జిల్లాలో ప్రభుత్వం తలపెట్టిన కాలువల అలైన్‌మెంట్‌ వల్ల ఇప్పటికే సాగునీటి సదుపాయం ఉన్న సారవంతమైన భూములను ఎక్కువ మంది కోల్పోనున్నారు. ఇదే కాస్త ఎగువ ప్రాంతంలో తూర్పు కనుమలకు ఆనుకుని కాలువ అలైన్‌మెంట్‌ రూపొందిస్తే రైతుల నుంచి సేకరించాల్సిన భూమి తగ్గడంతోపాటు లిఫ్ట్‌ల సంఖ్య 6నుంచి 4కు తగ్గుతుంది. భవిష్యత్తులో నిర్వహణ భారం కూడా ఆమేరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. రైతులు, రైతు సంఘం నాయకులతోపాటు సాగునీటి పారుదల శాఖలో ఆరితేరిన ఇంజినీరింగ్‌ నిపుణులు సైతం ఇదే మాట చెబుతున్నారు. ఇలా ప్రత్యామ్నాయం మార్గం చూపడంతోపాటు భూసేకరణలో 2013 చట్టాన్ని అమలు చేయాలని కూడా రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వానికిగానీ, ప్రత్యేకించి మన జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులకుగానీ పట్టలేదు. దీంతో, రైతులంతా సంఘటితమై ఏడాదిగా అనేక సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు నిరసనలు వ్యక్తం చేసినా పాలకులకు పట్టకపోవడంతో రాజకీయ పార్టీల మద్ధతు కూడగట్టడడంతోపాటు తగిన కార్యచరణ రూపొందించేందుకు ఈనెల 2న గంట్యాడ మండలం తాటిపూడి వద్ద నిర్వాసిత రైతు సదస్సును నిర్వహించిన విషయం విధితమే. ఈ సదస్సుకు ఎస్‌.కోట, గజపతినగరం నియోపకవర్గాల పరిధిలోని సుమారు 50గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు హాజరు కావడం విశేషం. సదస్సుకు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన గజపతినగరం, ఎస్‌.కోట నియోజకవర్గాల తాజా, మాజీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించినప్పటికీ తాజాలు హాజరు కాలేదు. కనీసం రైతులకు వారి తరపున సందేశం తెలియ జేయడం, లేదా రాలేకపోవడానికి గలకారణాలను తెలియ జేయడం వంటివి కూడా లేదు. దీన్నిబట్టి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు రైతుల సమస్యలపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. టిడిపికి చెందిన గజపతినగరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలువ అలైన్‌మెంట్‌ మార్చేవరకు పోరాడుతామని, ఇదే విషయాన్ని త్వరలో రానున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ దృష్టికి కూడా తీసుల్తానని హామీ ఇచ్చారు. ఎస్‌.కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను అన్యాయం చేయమే కాకుండా, ఏకపక్ష, నిర్భంద చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. అలైన్‌మెంట్‌ మార్పుకోసం జరుగుతున్న రైతుల పోరాటానికి వీరి వంతు ప్రయత్నం ఎలా ఉంటుందన్నది కాస్త పక్కనబెడితే సదస్సుకు హాజరు కావడం మంచి పరిణామమేనని రైతులు, ఇతర ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అసెంబ్లీలో చర్చకు వచ్చే విధంగా ప్రయత్నిస్తానని చెప్పినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. దీంతో, అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిపిఎం మాత్రం తొలి నుంచి నికరంగా రైతుల పక్షాన మాట్లాడుతోంది. అలైన్‌మెంట్‌ మార్చేవరకు రైతుల పక్షాన పోరాడుతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, తమ్మినేని సూర్యనారాయణ హామీ ఇచ్చారు. దీన్నిబట్టి ఏ పార్టీ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని జనం చర్చించుకుంటున్నారు.

➡️