ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌ వేగవంతం చేయాలి : కలెక్టర్‌

Feb 4,2024 00:26

ప్రజాశక్తి-గుంటూరు : పేదలందరికీ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్‌ను వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్‌, డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, కులగణన అంశాలపై సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవో, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులతో కలెక్టరేట్‌ నుండి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జనవరి 27వ తేది నుండి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్‌ మొదలైందని, 9వ తేదీ నాటికి పూర్తి చేయాలని చెప్పారు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి జిల్లాలో 1,46,280 మందిని మ్యాపింగ్‌ చేయాల్సి ఉండగా, 1,36,044 మందిని మ్యాపింగ్‌ చేశారని, ఇంకా 10,236 మందిని చేయాల్సి ఉందని తెలిపారు. డేటా రిఫ్లెక్ట్‌ అయి రిజిస్ట్రేషన్‌ కాని వాటిని వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు. వీఆర్‌ఓలు సంబంధిత సచివాలయల్లో ప్రత్యక్షంగా విధుల్లో వుండేలా చూడాలన్నారు. బయోమెట్రిక్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేపట్టాలని, సర్వే, ప్లాట్‌ నంబర్లు, పేర్లు వివరాల నమోదులో తప్పులు లేకుండా చూడాలని చెప్పారు. అధికారులు ఆయా మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల డేటా, లబ్ధిదారుల వివరాలు వారికి కేటాయించిన ప్లాట్లు తదితర అంశాలను పరిశీలించి రిజిస్ట్రేషన్‌ చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రంలో సంయుక్త కలెక్టర్‌ నేతృత్వంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు. తాడేపల్లిలో పంపిణీ చేయాల్సిన 3,777 వైయస్సార్‌ ఆరోగ శ్రీ కార్డులను వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించారు. వైద్య కార్డులు పంపిణీ చేసేటప్పుడు ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ఆరోగ్యశ్రీ యాప్‌ను మొబైల్‌ ఫోన్లలో డౌన్లోడ్‌ చేయాలన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుల ఈకెవైసీ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. జెసి జి.రాజాకుమారి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ ప్రఖార్‌జైన్‌, ఆర్డిఓ శ్రీఖర్‌ పాల్గొన్నారు.

➡️