ఇళ్ల స్థలాల అక్రమాలపై చర్యలేవి?

Dec 30,2023 21:22

ప్రజాశక్తి-బొబ్బిలి  :  ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల స్థలాల అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యమెందుకని అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు.. చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ, అధికారులను నిలదీశారు. కౌన్సిల్‌ హాల్లో శనివారం చైర్మన్‌ మురళీకృష్ణ అధ్యక్షతన కౌన్సిల్‌ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి కౌన్సిలర్‌ రాంబార్కి శరత్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ చెలికాని మురళి.. ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలపై నిలదీశారు. శరత్‌ మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల స్థలాలను అధికార పార్టీకి చెందిన వారు ఆక్రమిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వైస్‌ చైర్మన్‌ చెలికాని మురళి మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల స్థలాలు ఆక్రమణల వల్ల ప్రభుత్వానికి, వైసిపికి, ఎమ్మెల్యేకు చెడ్డపేరు వస్తుందని, తక్షణమే ఆక్రమణలను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఇందిరమ్మ కాలనీలో ఎన్ని ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి, ఆక్రమణకు గురైన వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు, పట్టణంలో ఎక్కడెక్కడ మున్సిపల్‌ స్థలాలు ఉన్నాయి, అవి ఎవరు ఆధీనంలో ఉన్నాయో వారంలో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనిపై టిపిఒ వరప్రసాద్‌ స్పందిస్తూ ఇందిరమ్మ కాలనీలో 16 పునాదులను తొలగించామని చెప్పారు. ఖాళీ స్థలాలపై రెవెన్యూ అధికారులను వివరాలు అడిగామని, వచ్చిన వెంటనే చెపుతామని వెల్లడించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, బోర్లు, కుళాయిలు వేయాలని కౌన్సిలర్లు కోరారు. కో-ఆప్షన్‌ సభ్యులపై సస్పెన్షన్‌ వేటుశ్మశానవాటిక, వ్యక్తిగత సమస్యపై సమావేశంలో మాట్లాడేందుకు ప్రయత్నించిన మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులు రియాజ్‌ ఖాన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ముస్లిముల శ్మశానవాటికలో అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, టిటిడి వద్ద తన షాపు తొలగించడం అన్యాయమని ఆయన అన్నారు. దీనిపై వైసిపి కౌన్సిలర్లు పి.ఉమ, ఇంటి గోవిందరావు, ఎస్‌.రామకృష్ణబాబు అభ్యంతరం చెప్పడంతో గందరగోళం నెలకొంది. కో-ఆప్షన్‌ సభ్యులు ఖాన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు చైర్మన్‌ మురళి ప్రకటించిడంతో ఖాన్‌ను మున్సిపల్‌ సిబ్బంది బయటకు నెట్టివేశారు. కౌన్సిల్‌ హాల్‌ బయటన ఖాన్‌ నిరసన తెలిపారు.కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయాలి మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ కౌన్సిల్‌ తీర్మానించి, ప్రభుత్వానికి పంపాలని టిడిపి కౌన్సిలర్‌ రాంబార్కి శరత్‌ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేయకూడదని వైస్‌ చైర్మన్‌ చెలికాని మురళి తెలిపారు. ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల స్థలాల ఆక్రమణలు, మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై టిడిపి, వైసిపి కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం జరిగింది.

➡️