ఇసుక లేక.. ఇల్లు గడవక..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు మూడు లక్షల మందికిపైగా భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. నిర్మాణ రంగంలో దాదాపు 35 రకాల పనులు చేసేవారున్నారు. బోర్లు తీసేవారు, రాడ్‌ బెండింగ్‌, తాపీ పని, సెంట్రింగ్‌, ప్లంబింగ్‌, కార్పెంటర్‌, ఎలక్ట్రిషీయన్లు, మార్బుల్స్‌ అతికేవారు, ఇటుక బట్టీల్లో పని చేసేవారు, కాంక్రీట్‌ మిల్లర్లు, భవన నిర్మాణ కార్మికులు ఇలా 36 రకాల పనులు చేసే వారుంటారు. వీరంతా రోజువారీ పనులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తుంటారు. తాపీ మేస్త్రీకి రూ.900, పనిచేసే కార్మికులకు రూ.600 వరకూ కూలి ఉంటుంది. నెలంతా పని చేస్తేనే వీరికి ఇల్లు గడుస్తోంది. ఇసుక సరఫరాను ప్రభుత్వం నిలిపివేయడంతో గడిచిన మూడు నెలలుగా నిర్మాణ రంగం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పనుల్లేక కార్మికులు రోడ్డున పడిన పరిస్థితి ఉంది. ఆదాయం లేకపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా మారింది. అద్దె ఇంట్లో ఉంటున్న కుటుంబాలు అద్దె చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. బ్లాక్‌ మార్కెట్లో ఇసుక విక్రయాలు కొనసాగుతున్నా ధరలు చూస్తే గుండె గుభేలుమంటుంది. మూడు నెలల క్రితం వరకూ పది చక్రాల లారీ ఇసుక రూ.18 వేల నుంచి రూ.20 వేలు వరకూ ఉండేది. ఇప్పుడు రూ.30 వేల నుంచి రూ.32 వేల వరకూ ధర పలుకుతోంది. మొన్నటి వరకూ టన్ను ఇసుక రూ.750 ఉండగా ప్రస్తుతం రూ.1400 వరకూ పలుకుతోంది. ట్రాక్టర్‌ ఇసుక రూ.1200 ఉండేది కాస్తా రూ.ఆరు వేలకు చేరింది. బ్లాక్‌మార్కెట్లో ఇసుక కొనుగోలు చేయాలంటే చుక్కలు కన్పిస్తున్నాయి. దీంతో నిర్మాణ రంగం పనులు పూర్తిగా నిలిచిపోయాయి. వైసిపి ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి కొత్త పాలసీ ప్రకటించడంలోనూ జాప్యం చేయడంతో భవన నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులు నెలలు తరబడి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. ఇంత పెద్దఎత్తున ఉపాధి పొందే రంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవన నిర్మాణ కార్మికుల పట్ల ప్రభుత్వం అత్యంత ఘోరంగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. లక్షల కుటుంబాలు ఉపాధి లేక అల్లాడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకుండా పోయింది. పిల్లలకు ఫీజులు కట్టలేక, ఇల్లు గడవక అప్పులు తెచ్చి కార్మికుల కుటుంబాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఇసుక సరఫరాలో ప్రభుత్వం ఆది నుంచి వివాదాస్పదంగానే వ్యవహరిస్తుందనే విమర్శలు విన్పిస్తున్నాయి. కొత్తగా ఉపాధి కల్పించకపోగా ఉన్న ఉపాధిని సైతం ప్రభుత్వం దెబ్బతీస్తుందనే చర్చ కార్మికుల్లో నడుస్తోంది. ప్రభుత్వం వెంటనే ఇసుక సరఫరాను వేగవంతం చేసి నిర్మాణరంగంలో పని చేసే కార్మికులను ఆదుకోవాలని అంతా కోరుతున్నారు.మూడు నెలలుగా పస్తులేఎర్రా రాంబాబు, బిల్డింగ్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు మూడు నెలలుగా ఇసుక సరఫరా లేకుండాపోయింది. దీంతో నిర్మాణ రంగంలో పని చేసే లక్షల కుటుంబాలకు పని లేకుండాపోయింది. నిర్మాణ రంగంలో దాదాపు 35 రకాల పనివారు ఉపాధి పొందుతున్నారు. పనులు లేకపోవడంతో కుటుంబాలు గడవడమే కష్టంగా మారింది. వెంటనే ఇసుక సరఫరా చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలి.ఇంటి అద్దె కట్టలేని పరిస్థితిఅయినపల్లి చినమాధవ, మదర్‌ థెరిస్సా రాష్ట్ర బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకులు ఇసుక లేక నిర్మాణరంగ కార్మికులకు పని లేకుండాపోయింది. మూడు నెలలుగా పని లేకపోవడంతో ఇంటి అద్దె సైతం కట్టలేని దుస్థితి నెలకొంది. లక్షల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఇసుక సరఫరా చేసి కార్మికుల ఉపాధిని కాపాడాలి.

➡️