ఉత్సాహంగా కోడిపోరు

ప్రజాశక్తి – కారంపూడి : పౌరుషానికి ప్రతీక కారంపూడి వీరాచార ఉత్సవాలని ప్రభుత్వ విప్‌, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పల్నాటి యుద్ధానికి సంబంధించి చరిత్రలో నాయకురాలు నాగమ్మ పురికొల్పటంతో కోడిపోరు జరిగింది. పల్నాటి ఉత్సవాల్లో భాగంగా ఈ ఘట్టాన్ని పీఠాధిపతి పిడుగు తరుణ్‌ చెన్నకేశవతో కలిసి స్థానిక వీర్ల దేవాలయ ఆవరణలో కోడిపందేలను నిర్వహించారు. మాచర్ల రాజ్యం తరపున పల్నాటి బ్రహ్మనాయుడి చిట్టిమల్లును ఎమ్మెల్యే చేతబూనారు, గురజాల రాజ్యం తరపున నాయకురాలు నాగమ్మ పందెపు కోడి శివంగి డేగను వైసిపి మండల నాయకులు కొంగర సుబ్రహ్మణ్యం చేతబట్టుకొని సంప్రదాయ ప్రకారం కోడి పందేలను నిర్వహించారు. పందెంలో బ్రహ్మనాయుడు కోడి (చిట్టిమల్లు) రెండు సార్లు విజయం సాధిస్తుంది. మూడోసారి ఎవరు గెలిస్తే వారు రాజ్యం వదిలి వెళ్లాలని అలనాడు బ్రహ్మనాయుడును నాయకురాలు నాగమ్మ రెచ్చగొడుతుంది. దీంతో మూడోసారి కోడిపందేనికి పల్నాటి బ్రహ్మనాయుడు సిద్ధం అవుతాడు. నాయకురాలు నాగమ్మ తంత్రాలతో ఆమె కోడి అయిన శివంగి డేగ విజయాన్ని సాధిస్తుంది. దింతో బ్రహ్మనాయుడు రాజ్యాన్ని వదిలి అరణ్యవాసానికి వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని గుర్తు చేస్తూ నిర్వహించిన కోడిపందేలు ఎంతో రసవత్తరంగా కొనసాగాయి. ఈ ఘట్టాన్ని చూడ్డానికి వైసిపి నాయకులు కె.చలమారెడ్డి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, వీరాచారావాంతులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్నాటి చరిత్ర చిహ్నాలను కాపాడుకుంటూ ఈ చరిత్రను దేశం నలుమూలలకు విస్తరింపచేసేలా కృషి చేయాల్సిన బాధ్యత పల్నాడు ప్రాంత ప్రజలపై ఉందన్నారు. 900 ఏళ్లుగా పల్నాటి ఉత్సవాలు నిరాటకంగా కొనసాగుతున్నాయని చెప్పారు. వీర్ల దేవాలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పల్నాడు వీరచార పీఠం నిర్వాహకులు బొగ్గవరపు విజరుకుమార్‌, ఎంపిపి ఎం.శారదశ్రీనివాసరెడ్డి, జెడ్‌పిటిసి షఫీ, వైస్‌ ఎంపిపి బి.సావిత్రి అల్లయ్య, కె.పిచ్చయ్య, సర్పంచ్‌ ఆర్‌.ప్రమీలబాయి తేజానాయక్‌, వైసిపి నాయకులు సిహెచ్‌.చంద్రశేఖర్‌రెడ్డి, పి.రామిరెడ్డి, కె.చంద్రశేఖర్‌, షేక్‌ అక్బర్‌, సొసైటీ చైర్మన్‌ కొమ్మిరెడ్డి నల్లా గురువారెడ్డి, మాజీ ఎంపిపి పి.వెంకటనరసయ్య, కె.సత్యం, ఇమామ్‌ పాల్గొన్నారు.

➡️