ఉద్యోగులను వేధిస్తే పుట్టగతులుండవు : యుటిఎఫ్‌

ప్రజాశక్తి-కడప అర్బన్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులను వేధిస్తే ప్రభుత్వానికి పుట్టగతులుండవని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్‌, పాలెం మహేష్‌ బాబు హెచ్చరించారు. గురువారం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కలెక్టరేట్‌ ఎదుట ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలన్నింటిని తక్షణం పరిష్కరిస్తానని హామీ ఇచ్చి, ఉద్యోగుల అండదండలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిట్ట నిలువునా మోసం చేశారని ఆరోపించారు. ఈ నాలుగున్నరేళ్ళ కాలంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒనగూరిందేమీ లేదన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఆర్సీ, డిఎ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను చెల్లించకపోగా ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం దాచుకున్న ప్రావిడెంట్‌ ఫండ్‌, ఎపిజిఎల్‌ఐ సొమ్మును సైతం కాజేసి ప్రభుత్వ అవసరాలకు మళ్లించారన్నారు. ఉద్యోగులు తమ పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, గహ నిర్మాణాల ఖర్చుల కోసం రుణాలకు దరఖాస్తు చేస్తే సంవత్సరాల తరబడి చెల్లింపులు లేవన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల తుది చెల్లింపులను సైతం ఈ ప్రభుత్వం చేయడం లేదంటే ఉద్యోగ, ఉపాధ్యాయులను ఏ స్థాయిలో వేధింపులకు గురి చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉందని ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూనే మరోపక్క ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలు కూడా చెల్లించడం లేదన్నారు. సంక్షేమ పథకాలను బటన్‌ నొక్కడం ద్వారా అమలు చేస్తున్నామని ప్రకటించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల బటన్‌ ఎందుకు నొక్కడం లేదని నిలదీశారు. 2023 జూలై 1వ తేదీ నుండి నూతన పిఆర్సీని అమలు చేయాల్సి ఉండగా కమిషన్‌ ను నియమించిందే తప్ప, విధి విధానాలు రూపొందించి అమలు చేసిన పాపాన పోలేదన్నారు. వెంటనే పిఆర్సీని అమలు చేయాలని, ఈలోపు 30 శాతం మధ్యంతర భతిని ప్రకటించి అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం దిగిరాకపోతే జనవరి 9, 10 తేదీలలో విజయవాడలో 36 గంటల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.చంద్రశేఖర్‌, జిల్లా కార్యదర్శి ఎ.రామ్మోహన్‌, ప్రముఖ కవి చెన్నకేశవులు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సునీల్‌ కుమార్‌, రాష్ట్ర నాయకులు సగిలి రాజేంద్ర ప్రసాద్‌ ధర్నాకు మద్దతు తెలిపి ప్రసంగించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు ఎన్‌.నాగార్జున రెడ్డి, సహాధ్యక్షులు వై.రవికుమార్‌, డి.సుజాత రాణి, ట్రెజరర్‌ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు డి.వి.రవీంద్రుడు, సి.శ్రీనివాసులు, కె.చెన్నయ్య, సి.వి.రమణ, కె.మురళీకృష్ణ, ఎల్‌.చంద్ర ఓబుళ్‌రెడ్డి, ఎ.శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఎస్‌.ఓబుల్‌ రెడ్డి, డి.రూతు ఆరోగ్య మేరీ, ఆడిట్‌ కమిటీ జిల్లా కన్వీనర్‌ ఎం.ప్రభాకర్‌, సిపిఎస్‌ జిల్లా కన్వీనర్‌ సి.సుదర్శన్‌, కో కన్వీనర్స్‌ కె.గంగయ్య, ఎల్‌.కరీముల్లా, బి.వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.

➡️