ఉద్యోగుల షోకాజ్‌ నోటీసుల దహనం

షోకాజ్‌ నోటీసుల దహనం

ప్రజాశక్తి-కాకినాడపది రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు నోటీసులు ఇవ్వడం ద్వారా, మెమోలు పంపడం ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని, అధికారులు ఇచ్చిన నోటీసులను అంబేద్కర్‌ విగ్రహం వద్ద దహనం చేసి శుక్రవారం నిరసన తెలిపారు. బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సమ్మె శిబిరంలో యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి, జెవివి రాష్ట్ర కార్యదర్శి కెఎంఎం.ఆర్‌ ప్రసాద్‌, నాయకులు బిబీ నాంచారిదేవి మాట్లాడారు. రాష్ట్రంలో ఏ చిన్న ఉద్యమం జరిగినా సమస్యలు పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యమాల అణిచివేతకే ప్రాధాన్యతని ఇస్తోందన్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు ఉద్యోగులు ఏమాత్రం ఆందోళన చెందవద్దని, మీ ఉద్యమం విజయవంతం అయ్యేదాకా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యుటిఎఫ్‌ టీచర్లు మీకు సంపూర్ణ మద్దతుగా నిలబడతారని తెలిపారు. తక్షణం సమగ్ర శిక్ష ఉద్యోగులను చర్చలకు పిలిచి అన్ని డిమాండ్లు పరిష్కరించాలని జగన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు సుదీర్ఘ పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరుణాకరన్‌, సీతారామారావు, పి.గిరిగోపాల్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, జెఎసి జిల్లా అధ్యక కార్యదర్శులు ఎం.చంటిబాబు, సత్య నాగమణి, ఉపాధ్యక్షులు పివివి మహాలక్ష్మి, ఎ.లోవరాజు, జి.నారాయణ, శ్రీనివాస్‌, పి.రాజు, ఎం.గంగాధర్‌, రాధాకృష్ణ పాల్గొన్నారు.

➡️