ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం డ్వామా పీడీ ఎ.రాముకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ బృందం ఉపాధి హామీ కూలీల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని, మరోపక్క వర్ష ప్రభావం తక్కువగా ఉండటంతో పంటలు ఎండిపోయాయని, దానివల్ల వ్యవసాయ కూలీలకు పనుల్లేకుండా పోయాయని తెలిపారు. పనుల్లేని వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ చట్టం ద్వారా పనులు కల్పించాలని కోరారు. వ్యవసాయం దెబ్బతినడంతో ఎక్కువ మంది కూలీలు సుదూర ప్రాంతాలకు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టం ద్వారా అదనంగా పనులు కల్పించి వ్యవసాయ కూలీల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఉపాధి హామీ చట్టం పేదలకు వరంలా ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయ కార్మికుల్లో ఎక్కువమంది దళితులు, గిరిజనులు, ఇతర కులాల్లో ఉన్న పేదలు ఈ పనులు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో ఉపాధి పనులు చేసిన కూలీలకు మూడు నుండి ఆరు వారాల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పని ప్రదేశాల్లో కూలీలకు పేస్లిప్పులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో కొన్ని మండలాల్లో పే స్లిప్పులు ఇవ్వకుండానే ఇస్తున్నట్లు బిల్లులు పెడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి అవినీతికి పాల్పడుతున్న వారిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నూజివీడు, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లోని మండలాల్లో ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటివారిని వెంటనే విధులు నుండి తొలగించాలని డిమాండ్‌ చేశారు. కూలీలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం, ఉపాధి హామీ సిబ్బంది పరిష్కారం చేయాలనీ కోరారు. లేని పక్షంలో ఉపాధి కూలీలతో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం డ్వామా పీడీ మాట్లాడుతూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరో పది రోజుల్లో ఉపాధి కూలీలకు వేతన బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం, జిల్లా ఉపాధ్యక్షులు తామ ముత్యాలమ్మ, ఎస్‌.మహంకాళిరావు, సహాయ కార్యదర్శి ఎం.సుధారాణి, జిల్లా నాయకులు ప్రభాకర్‌, డి.దాసు, మేరీ, సాయికృష్ణ పాల్గొన్నారు.

➡️