ఎకరా వరికి రూ.30వేలివ్వాలి : సిపిఎం

Dec 6,2023 21:29
శ్రీకాళహస్తిలో పేదల కాలనీలను పరిశీలిస్తున్న సిపిఎం బృందం

ఎకరా వరికి రూ.30వేలివ్వాలి : సిపిఎంప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ తిరుపతి జిల్లాలో తుపాను వల్ల వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారని, ఎకరా వరికి 30వేలు, ఎకరా వాణీజ్య పంటలకు రూ.50వేలు చొప్పున నష్టపరిహారం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్‌ చేశారు. వేలాది ఇళ్లు కూలిపోయి పేదలు నిరాశ్రయులయ్యారన్నారు. ఇళ్లకు లక్ష రూపాయలు, మృతులకు పది లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌పునరుద్ధరణ కాని గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, ఫోన్‌ ఛార్జింగ్‌ అయిపోవడంతో కనీసం తమ బంధువులకు సమాచారం ఇవ్వలేని స్థితిలో ఉన్నారన్నారు. విద్యుత్తు వెంటనే పునరుద్ధరించి సంబంధాలు తెగిపోయిన గ్రామాలకు ఆహార , మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. శ్రీకాళహస్తిలో…బుధవారం తొట్టంబేడు మండలంలోని ఈదులగుంట, చెంచులక్ష్మికాలనీ, తంగేళ్లపాలెం, శ్రీరామ్‌నగర్‌ కాలనీ, బోనుపల్లి, కంచనపల్లి, చేమూరు, చియ్యవరం గ్రామాల్లో పర్యటించి బాధితులను సిపిఎం జిల్లా నాయకులు అంగేరి పుల్లయ్య పరామర్శించారు. ఆస్తి, పంట నష్టాలపై ఆరా తీశారు. వెయ్యి ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని, వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. తుపాను నష్టంపై తొట్టంబేడు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పెనగడం గురవయ్య, గంధం మణి, వెలివేంద్రం ఉన్నారు. సత్యవేడులో సిపిఎం నాయకులు రమేష్‌ పర్యటించారు. గిరిజనుల రోదన నాయుడుపేట : స్వర్ణముఖి అవతల జగనన్న ఇంటి స్థలాల వద్ద 35 గిరిజన కుటుంబాల వారు ఉంటున్నారు. గుడిసెలు పడిపోయి మూడు రోజులుగా భోజనం, కరెంట్‌ లేక అంధకారంలో ఆకలితో అలమటిస్తూ ఉన్నారు.ఎవరికైనా ఫోన్‌ చేద్దామన్నా ఛార్జింగ్‌ లేని పరిస్థితి లేదు. సిపిఎం నాయకులు శివకవి ముకుంద, చంద్రకళ విషయం తెలుసుకుని కమిషనర్‌కు ఫోన్‌లో తెలియజేశారు. కనీసం రాత్రికైనా భోజనం అందించాలని విజ్ఞప్తి చేశారు. బాలుని కుటుంబానికి రూ.50లక్షలివ్వాలి : సిపిఎం తిరుపతి (మంగళం) : వెంకటాపురం పంచాయతీ అన్నాసపల్లిలో మంగళవారం ఉదయం కె.నిఖిల్‌ (11) నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినా ఆ బాలుని మృతదేహాన్ని వెలికితీయడంలో అధికారుల నిర్లక్ష్యం తగదని సిపిఎం నగర కార్యదర్శి టి.సుబ్రమణ్యం, నాయకులు వేణు మండిపడ్డారు.బాలుని కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. రెండు రోజులు అయినా బాలుని ఆచూకీ కనుక్కోవడంలో నిర్లక్ష్యం కనబడుతోందన్నారు. శ్రీకాళహస్తిలో పేదల కాలనీలను పరిశీలిస్తున్న సిపిఎం బృందం

➡️