ఎక్కడికక్కడ నిర్బంధం

ప్రజాశక్తి-గుంటూరు : అంగన్‌వాడీల చలో విజయవాడ కార్యక్రమంపై ప్రభుత్వం తీవ్ర నిర్భందం ప్రయోగించింది. విజయవాడ వెళుతున్న అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేశారు. తిరుపతి నుండి వచ్చిన అంగన్వాడీలు దాదాపు 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌ కల్యాణ మండపంలో ఉంచారు. పల్నాడు జిల్లా మాచర్ల అంగన్వాడీలను కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌, గుంటూరు ప్రాజెక్ట్‌ అంగన్వాడీలను నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో, పొదిలికి చెందిన అంగన్‌వాడీలను నల్లపాడు పోలీసు స్టేషన్‌లో నిర్బంధించారు. సోమవారం ఆయా స్టేషన్లలో ఉన్న అంగన్‌వాడీలను సిఐటియు, ప్రజా సంఘాల నాయకులు పరామర్శించారు. కోటి సంతకాలతో తమ సమస్యలు సిఎం జగన్మోహన్‌రెడ్డికి చెప్పుకుందాని వెళుతున్న వారిని అప్రజాస్వామికంగా నిర్బంధించటం తగదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.శ్రీనివాసరావు అన్నారు. అర్ధరాత్రి నిర్బంధించారని, వారికి సరైన సదుపాయాలు గానీ, ఆహారం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలను పరమర్శించిన వారిలో ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్‌.అరుణ, నగర కార్యదర్శి ఎ.కల్యాణి, సిఐటియు నాయకులు ఎ.నికల్సన్‌, సుబ్బారాయుడు, ఆవాజ్‌ జిల్లా, నగర నాయకులు ఎస్‌కె బాష, సైదా, కార్తీక్‌ తదితరులున్నారు.
నిర్బంధం ఇలా..
చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు గురటూరు, పల్నాడు జిల్లాల్లో పోలీసులు సోమవారం తెల్లవారుజాము నుంచే అరెస్టులు కొనసాగించారు. ఆందోళనలకు మద్దతు తెలుపుతున్న సిఐటియు, సిపిఎం, రైతు సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. తెనాలిలో రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి, షేక్‌ హుస్సేన్‌వలి, అంగన్వాడీ కార్యకర్తలు దుర్గ, రమాదేవి, విజయలక్ష్మి, శోభారాణి తదితరులను నిర్బంధించారు. తాడేపల్లి మండలం కుంచనపల్లి ప్రాతూరు రోడ్డు జాతీయ రహదారి వద్ద సోమవారం నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులను అరెస్టు చేసి మంగళగిరి స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో సిపిఎం కార్యకర్త మద్దూరి ఏసుదాసు చెవికి గాయమైంది. మంగళగిరిలో కార్మిక సంఘం నాయకులను వెళ్లకుండా సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, ఎఐటియుసి నాయకులు ఎ.ప్రభాకర్‌ను మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. చిలకలూరిపేటలో కార్యకర్తలను బయటకు రానివ్వకుండా నిర్బంధంలో ఉంచారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురుకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలును అరెస్టు చేసి మంగళగిరికి తరలించారు. తెనాలి త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్లో సిపిఎం మండల కార్యదర్శి కె.బాబుప్రసాద్‌, సిఐటియు నాయకులు షేక్‌ హుస్సేన్‌వలి ని ఉంచారు. పొన్నూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో సిఐటియు నాయకులు ఎన్‌.రమేష్‌ బాబు, ఎంవి.సుకన్య, డి.పద్మజ. సిహెచ్‌ దుర్గ, డి.సుజాత, ఎన్‌.భవాని, నాగేంద్రమ్మ, ఎ.రామారావును నిర్బంధించారు. సత్తెనపల్లి రైల్వే స్టేషన్‌కు ఆటోలో వెలుతున్న అంగన్వాడీ కార్యకర్తలను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందిగామ అడ్డరోడ్డు వద్దు తెల్లవారుజామున 4 గంటల నుండి పోలీసులు వాహనాలను తనిఖీ చేపట్టారు. సిఐటియు బెల్లంకొండ మండల కార్యదర్శి సిహెచ్‌ పుల్లారావుకు నోటీసులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా నుంచి విజయవాడ వెళుతున్న అంగన్వాడీలను దాదాపు 180 మందిని గుంటూరు సమీపంలో ఆపి నగరంలోని పోలీస్‌ కల్యాణ మండపంలో ఉంచారు. విజయవాడ వెళుతున్న అంగన్వాడీలను కాజా టోల్‌ గేట్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దశల వారీగా సుమారు 139 మందిని అదుపులోకి తీసుకుని గుంటూరు తరలించారు. ఆదివారం రాత్రి నుంచి ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.పి.మెటిల్డాదేవిని, సిఐటియు చిలకలూరిపేట మండల కన్వీనర్‌ పి.వెంకటేశ్వర్లును గృహ నిర్బధంలో ఉంచారు.

➡️