ఎగబాకుతున్న బియ్యం

Jan 25,2024 00:21

ప్రజాశక్తి-గుంటూరు : బియ్యం ధరలు రోజురోజూకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వీటి ధరలను నియంత్రించకపోవటంతో సామాన్యులు పెరిగిన ధరలతో అల్లాడుతున్నారు. ఇప్పటికే పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరలు పెరుగుదలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడు బియ్యం ధరలూ పెరుగుతుండటంతో సామాన్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గతంలో జిఎస్‌టి పేరుతో బియ్యం ధరలు పెంచితే ఇటీవల మిచౌంగ్‌ తుపాను పేరుతో మరోసారి పెంచారు. మొత్తంగా ఏడాది కాలంలో హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలోకురూ.15ల వరకూ పెరిగింది. ఇటీవల మిచౌంగ్‌ తుపాను వల్ల పంట దిగుబడి తగ్గిందని, ధాన్యం సరఫరా లేదని అందువల్ల ధరలు పెరిగాయని మిల్లర్లు, వ్యాపారులు అంటున్నారు. బియ్యం ధరలు పెరగటం వల్ల ప్రతి కుటుంబంపై నెలకు రూ.400, ఏడాదికి సుమారుగా రూ.5వేలు అదనపు భారం పడురతోంది. ఈ పెరుగుదల ఇంతటితో ఆగకుండా రానున్న రోజుల్లో మరింతగా ధరలు పెంచే అవకాశం లేకపోలేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి. జిల్లాలో ప్రజలు ఎక్కువగా సోనా మసూరి, బిపిటి, హెచ్‌ఎంటి బియ్యం రకాలు వినియోగిస్తారు. దాదాపు ఏడాది కాలంలోనే వీటి ధరలు భారీగా పెంచేశారు. గతేడాది సోనా మసూరి కిలో రూ.44లు ఉంటే ఇప్పుడు రూ.60లు వసూలు చేస్తున్నారు. బిపిటి రూ.40లు ఉంటే ఇప్పుడు రూ.56లు ఉంది. హెచ్‌ఎంటి స్ట్రీమ్‌ రూ.44ల నుండి రూ.61లకు, బిపిటి స్ట్రీమ్‌ రూ.38 నుండి రూ.50లకు పెరిగింది. హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే ధరలు ఈ విధంగా ఉంటే రిటైల్‌ మార్కెట్‌లో వీటి ధరలు మరింత పెంచేశారు. కిలోరూ.70కుపైగా వసూలు చేస్తున్నారు. బియ్యం ధరల పెరుగుదల వల్ల ప్రజలపై ప్రత్యక్షంగా భారం పడటంటంతోపాటు, పరోక్షంగా హోటల్స్‌లోనూ ఆహారం ధరలు పెంచేశారు. అదేమంటే బియ్యం ధరలు పెరిగాయని హోటల్‌ నిర్వాహకులు అంటున్నారు. మిచౌంగ్‌ తుపాను వల్ల ఈ ఏడాది వరిలో దిగుబడి కొంత మేర తగ్గింది. పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్‌ కుడి కాల్వకు సాగునీరు విడుదల చేయకపోవటంతో ఈ ఏడాది ఆయకట్టు పరిధిలో వరి సాగు తగ్గింది. గుంటూరు జిల్లాలోనూ సాధారణం కంటే సాగు తగ్గింది. ఈ ప్రభావం దిగుబడిపై పడింది. గుంటూరు జిల్లాలో 166,190 ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా, 138,615 ఎకరాల్లోనే వరిసాగు చేశారు. అయితే మిచౌంత్‌ తుపాను వల్ల సుమారు 26 65 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఎకరాకు దాదాపు 40 బస్తాలు పండాల్సి ఉంటే 30 బస్తాలకు దిగుబడి తగ్గింది. అటు సాగు విస్తీర్ణం తగ్గటం, తుపాను ప్రభావం రెండూ దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో వ్యాపారులు ఇదే సాకుగా చూపి రేట్లు పెంచేశారు. తుపాను సంభవించిన నెలలోనే బియ్యం ధర కిలోకు దాదాపు రూ.5 పెంచారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని బియ్యం ధరలు నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

➡️