ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయాలి

పాదయాత్ర చేస్తున్న సూరకుంట గ్రామస్తులు

ప్రజాశక్తి -చింతూరు

మండలంలోని సూరకుంట గ్రామంలో ఉన్న ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయాలని కోరుతూ ఆ గ్రామస్తులు సూరకుంట నుంచి చింతూరు ఐటిడిఎ వరకు బుధవారం 15 కిలో మీటర్ల మేరకు పాదయాత్ర నిర్వహించారు. ఐటిడిఎ వద్ద ఆందోళన చేపట్టి, పిఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ అమరవీరులు కొమరం భీమ్‌, బిర్సా ముండా విగ్రహాల వద్ద నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయాలని అనేక సార్లు విన్నవించినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో పాదయాత్ర చేపట్టామని పేర్కొన్నారు. 2003లో భద్రాచలం ఐటీడీఏ ద్వారా చంద్రవంక వాగు నుండి పొలాలకు నీళ్ళు వెళ్ళడానికి లిప్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అది మూడేళ్లకే మరమ్మతులకు గురైనా ఇంత వరకు మరమ్మతులు చేయలేదన్నారు. 2012లో రెండవ గుంపునకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను ఏర్పాటు చేశారుగాని నేటికీ ప్రారంభించలేదన్నారు. తక్షణమే మరమ్మతులు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సూరకుంట నాయకులు తోడం సుబ్బరాజు మాట్లాడారు. సోడే శ్రీను, తోడం చంద్రయ్య, గిరిజన సంఘం చింతూరు నాయకులు వేక రాజ్‌ కుమార్‌, మొట్టం రాజయ్య తదితరులు సంఘీభావం తెలిపారు.

➡️