ఎన్నాళ్లీ నిరీక్షణ

Jan 28,2024 21:27

ఓ వైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరోవైపు అధికారంలో ఉన్న వైసిపి సభలు, సమావేశాలతో పాటు గెలుపు గుర్రాల వేట ముమ్మరం చేసింది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పూర్తిస్థాయిలో ప్రకటించకపోయినా అభ్యర్థులకు వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి పరోక్షంగా గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, కొన్ని చోట్ల నియోజకవర్గ సమన్వయకర్తలు ఎన్నికల పనిలో నిమగమయ్యారు. ఇప్పటికే మండలాల వారీగా పార్టీ కార్యాలయాల ఏర్పాటు, రోజువారీ శిబిరాల పరంపర ప్రారంభమైంది. టిడిపి నుంచి అభ్యర్థుల విషయం కనీసం కొలిక్కి రాకపోవడంతో తెలుగు తమ్ముళ్లలో గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది.

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఎప్పటి మాదిరిగానే మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి బంజ్‌దేవ్‌, మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి మధ్య ఎన్నికల్లో సీటు కోసం గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య పోరు నడుస్తుండగా, తేజోవతి అనే మరో మహిళ ఇటీవల తెరపైకి వచ్చారు. ఆమెను పార్టీలోని కొంతమంది పెద్దలే ప్రోత్సహిస్తున్నారన్న చర్చ కూడా ముమ్మరంగానే సాగుతోంది. పార్వతీపురంలో విజరుచంద్రను ఇన్‌ఛార్జిగా నియమించినప్పటికీ ఆయనతో పార్టీలో కీలక నేతలు కలిసిరావడం లేదనే చర్చ తెలుగు తమ్ముళ్లను విస్మయానికి గురిచేస్తోంది. కురుపాంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి, మాజీ ఎమ్‌పి ప్రదీప్‌ చంద్రదేవ్‌ కుమారుడు వీరేశ్‌ చంద్రదేవ్‌, బిడ్డిక పద్మావతి, పువ్వల లావణ్య.. సీటు తనకంటే తనకేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాలకొండలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ, నియోజకవర్గ నాయకులు పడాల భూదేవితోపాటు మరో ఇద్దరు టికెట్‌ ఆశిస్తున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఆశావహులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడంతో టిడిపి గ్రామ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు గందరగోళానికి గురౌతున్నారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులును ఇప్పటికే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్తగా వైసిపి మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో తలే రాజేష్‌బాబును ఇన్‌ఛార్జిగా నియమించారు. సీటు కూడా దాదాపు ఖరారైనట్టుగా చర్చ నడుస్తోంది. అందుకు తగ్గట్టే ఆయన ఎన్నికల పనులు మొదలుపెట్టారు. మిగిలిన అన్ని చోట్లా సిట్టింగులకే ఇస్తారని ప్రచారం నడుస్తోంది. పోటీదారులు కూడా పెద్దగా కనిపించకపోవడం వల్ల దాదాపు వీరికే ఈసారి కూడా అవకాశం దక్కుతుందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. టిడిపిలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. దాదాపు బేబినాయనకు ఖారారైందనుకున్న బొబ్బిలి అసెంబ్లీ సీటుకు తిరిగి స్థానిక మాజీ ఎమ్మెల్యే సుజరుకృష్ణ రంగారావు కూడా పోటీ పడుతున్నారని చర్చ నడుస్తోంది. విజయనగరంలో పూసపాటి అశోక్‌ గజపతా? లేక ఆయన కుమార్తె అదితి గజపతా? అన్న తెలుగు తమ్ముళ్ల సందేహాలకు ఇప్పటికీ అధిష్టానం సమాధానం చెప్పడం లేదు. నెల్లిమర్లలో ఇటీవల నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజుకు ఈ సారి పోటీ అవకాశం దక్కుతుందనుకున్నా, అదే స్థానాన్ని జనసేన కోరుతోంది. ఈ నేపథ్యంలో నెల్లిమర్ల స్థానం ఏ పార్టీకి దక్కుతుందో? ఒక వేళ జనసేన వెనక్కి తగ్గి, టిడిపికే కేటాయించినా కంది చంద్రశేఖర్‌, పతివాడ నారాయణ స్వామి నాయుడు మనుమడు తారకరామానాయుడు, నెల్లిమర్ల నాయకులు కడగల ఆనంద్‌ కూడా పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. శృంగవరపుకోటలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ సీటు తమదంటే తమదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఇద్దరు వేర్వేరుగా సమావేశాలు, శిబిరాలు నడపడంతో టిడిపి నాయకులు, కార్యకర్తలకు ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. గజపతినగరం నియోజకవర్గంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు ఈసారి కూడా తానే పోటీచేస్తానని చెబుతుండగా, తన కుమారుడు శ్రీనివాసరావు పోటీ చేసేందుకు అనుగుణంగా చంద్రబాబు మాట ఇచ్చారని కొండపల్లి కొండబాబు తెగేసి చెప్పుకుంటున్నారు. చీపురుపల్లిలో ఇప్పటి వరకు కిమిడి నాగార్జున పోటీచేస్తారని ప్రచారం జరగగా, తాజాగా విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు కూడా వినిపిస్తోంది. రాజాంలో మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌కు దాదాపు టికెట్‌ ఖరారైనట్టుగా ఇటీవల ప్రచారం జరిగింది. కానీ, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకటరావు అనుచరులు నిన్నగాక మొన్న రహస్య సమావేశం ఏర్పాటు చేయడం, అందులో కోండ్రును తీవ్రంగా వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. ఇంకోవైపు కావలి గ్రీష్మ కూడా పోటీ చేసేందుకు తహతహలాడుతున్నారు.

➡️