ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

Mar 27,2024 21:12

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  : సార్వత్రిక ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లాలోని పోలీసు అధికారులతో ఆయన నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌ కేసులు, మర్డర్‌, ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, 174 సిఆర్‌పిసి కేసులు, మిస్సింగ్‌, చీటింగ్‌ కేసులు, సైబర్‌ నేరాలు, ఇతర కేసులను సమీక్షించారు. పోలీస్‌ స్టేషన్ల వారీగా పెండింగ్‌ కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నమోదైన కేసుల్లో నేరస్తుల అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై సంబంధిత పోలీస్‌ అధికారులతో ఆరా తీసి కేసుల ఫైల్స్‌, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల ఛేదింపునకు, పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు, మెళకువలను అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు ఇప్పటినుండే సిద్ధం కావాలన్నారు. ముందుగా సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ఆ ప్రాంతాలను సెక్టార్ల ప్రకారం విభజించి ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. అక్కడ అనుసరించాల్సిన కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు బందోబస్తు విధులు నిర్వహించేందుకు వచ్చిన కేంద్ర పోలీస్‌ దళాలతో ఫ్లాగ్‌మార్చ్‌, రూట్‌ మార్చ్‌, తదితర విధులు ఎన్నికలు పూర్తయ్యే వరకు నిర్వహించాలని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలను విరివిగా సందర్శించాలని ఆదేశించారు. ప్రత్యేక నిఘా పెడుతూ ముందస్తు సమాచారం సేకరించాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలింగ్‌ కేంద్రాలను అధికారులు సందర్శించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని ఆదేశించారు. గతంలో ఎన్నికల్లో నమోదైన కేసుల్లో వారిపై తీసుకున్న చర్యల గురించి ముందుగా సమాచారాన్ని సేకరించాలన్నారు. సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. సమావేశంలో ఎఎస్‌పి సునీల్‌ షరోన్‌, డిఎస్‌పిలు ఎస్‌.ఆర్‌.హర్షిత, జి.వి.కృష్ణారావు, జి.మురళీధర్‌, వెంకట అప్పారావు, ఎస్‌.ఎండి.అజీజ్‌, సిఐలు సిఎచ్‌.లక్ష్మణరావు, బి.ఎం.డి.ప్రసాద్‌రావు, ఎఆర్‌ ఆర్‌ఐ శ్రీరాములు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️