బాధ్యులను కఠినంగా శిక్షించాలి- జాతీయ రహదారిపై రాస్తారోకోలో చేనేతలు

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ మదనపల్లె నీరుగట్టువారిపల్లె చెందిన చేనేత కార్మికుడు రామిశెట్టి రమేష్‌ బాబు (50) కురబలకోట మండలం అంగళ్లులోని మల్లయ్యకొండలో సూసైడ్‌ నోట్‌ రాసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెప్పారు. స్థల వివాదంతోనే రమేష్‌ బాబు ఆత్మహత్య చేసుకున్నట్లు చేనేత కార్మికులు ఆరోపిస్తూ గురువారం జిల్లా ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమేష్‌ బాబు రెండేళ్ల కిందట స్థానిక కాట్లాటపల్లె రోడ్డులోని సర్వే నంబర్‌ 605లో ఉన్న వెంకటేష్‌, చంద్ర, శివారెడ్డి వద్ద చెందిన ఒకటిన్నర కుంట స్థలాన్ని రూ.10.5 లక్షలకు కొనుగోలు చేశాడని తెలిపారు. ఆ స్థలం తమదేనంటూ నీరుగట్టువారిపల్లెకు చెందిన పురాణం చంద్రశేఖర్‌, తమ్ముడు పురాణం రత్నం, ఇతని బంధువులు ప్రసాద్‌, శ్రీకాంత్‌, అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పారు. పైగా ఆ స్థలంలోకి రమేష్‌ బాబును వెళ్లనీయకుండా తరచూ గొడవపడుతూ వేధిస్తున్నారన్నారు. స్థలం అమ్మిన చంద్ర, వెంకటేష్‌, శివారెడ్డి సమస్యను పరిష్కరించలేదని తెలిపారు. ఈ క్రమంలో వీరి వేధింపులు భరించలేని రమేష్‌ బాబు మల్లయ్యకొండలో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. ఈ ఏడుగురి కారణంగానే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని, సహచర కార్మికులు ఆరోపిస్తూ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఒకటిన్నర కుంట స్థలాన్ని రమేష్‌ బాబు కుటుంబానికి అప్పగించాలని స్పష్టం చేశారు. మరో 11 మంది నేత కార్మికులు అదే స్థలాన్ని కొనుగోలు చేశారన్నారు. పురాణం చంద్రశేఖర్‌, రత్నం, శ్రీకాంత్‌, ప్రసాద్‌ మిలటరీ కోటా కింద కేటాయించినట్లు ఫేక్‌ డాక్యుమెంట్లు సష్టించి స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. వివాదానికి కారణమై పలువురి పొట్ట కొడుతున్న ఆ స్థలాన్ని పూర్తి స్థాయిలో పరిశీలన చేసి నిజ నిజాలను నిర్ధారించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వన్‌ టౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి చెప్పారు.

➡️