ఎన్నికల ఫిర్యాదులపై 100 నిముషాల్లో స్పందన

Mar 18,2024 00:17

కంట్రోల్‌ రూమ్‌లో వివరాలు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేస్తున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
ఎన్నికల షెడ్యూల్‌ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేయాలని అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ఆదేశించారు. ఈ మేరకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల సిబ్బందితో జెసి ఎ.శ్యాంప్రసాద్‌తో కలిసి కలెక్టర్‌ ఆదివారం సమీక్షించారు. ప్రవర్తన నియమావళి, వ్యయ ఉల్లంఘలను ఇతర ఏమైనా ఉల్లంఘాలను నివేదించడానికి నిర్దేశించిన సి.విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు అందిన 100 నిముషాల్లో స్పందించాలని, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వీటిని రిటర్నింగ్‌ అధికారులు పరిశీలించాలని చెప్పారు. ఎన్నికల కమిషన్‌కు రోజువారీ సమర్పించాల్సిన నివేదికలు సకాలంలో సమర్పించేలా పూర్తి శ్రద్ద పెట్టాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నికలు కమిషన్‌ నిషేధించిన ఫొటోలు, బ్యానర్లు వెంటనే తొలగించడంలో నిర్లక్ష్యం కూడదన్నారు. ఎన్నికల కంట్రోల్‌ రూంకు, ఇతర రూపాల్లో అందిన ఫిర్యాదులపై 24 గంటలలో చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు, ముద్రణకు సంబంధించి ముందస్తు అనుమతులు తప్పనిసరని, దీనిపై ప్రింటర్స్‌ యాజమాన్యంతో రిటర్నింగ్‌ అధికారులు సమావేశమై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రచురుణలపై ప్రింటింగ్‌ ప్రెస్‌ పేరు, ప్రతుల సంఖ్య తప్పనిసరిగా ముద్రించాలన్నారు. లేకుంటే సంబంధిత ప్రింటర్స్‌కు నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.కంట్రోల్‌లో పరిశీలనఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఎన్నికల కంట్రోల్‌ రూంను కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ఆదివారం సందర్శించారు. ఎన్నికలకు సంబంధించిన యాప్‌లు ఏవి? ఎలా పర్యవేక్షిస్తున్నారు? అనే విషయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు.

➡️