ఎన్నికల విధుల్లో అపశృతి!

విద్యుదాఘాతంతో సచివాలయ ఉద్యోగి మృతి

కటౌట్‌ తొలగిస్తుండగా విద్యుదాఘాతంతో సచివాలయ ఉద్యోగి మృతి

ప్రజాశక్తి-దేవరాపల్లి: ఎన్నికల విధుల్లో అపశృతి చోటుచేసుకుంది. ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా ఫ్లెక్సీలను తొలగిస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కొత్తపెంట గ్రామ సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంటు డెక్క చిరంజీవి(34) దుర్మరణం చెందాడు. దేవరాపల్లి మండలం ములకలాపల్లిలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న విషాధ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలివి.ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో గ్రామాల్లోని రాజకీయ పార్టీల ఫెక్సీలను ఆదివారం ఉదయం 10 గంటలలోగా తొలగించి ఫొటోలను పంపించాలంటూ గ్రామ సచివాలయ ఉద్యోగులపై రెవెన్యూ అధికారులు ఆదేశించారు. లేకుంటే చర్యలుంటాయని హుకుం జారీ చేయడంతో గ్రామాల్లో కటౌట్లు, ఫ్లెక్సీల తొలగింపు పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా కొత్తపెంట సచివాలయ పరిధిలోని ములకలాపల్లిలో కటౌట్లు తొలగించేందుకు తన స్నేహితుడు దాసరి శ్రీనుతో చిరంజీవి ఆదివారం ఉదయం 8 గంటలకే అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే విఆర్‌ఒ రాంబాబు, ఇంజనీరింగ్‌ అసిస్టెంటు చంటి తదితరులు చేరుకోగా, పాలకేంద్రానికి ఆనుకుని పొలం గట్టుపై స్తంభానికి కట్టిన ఐరన్‌ ఫ్రేముతో పొడువుగా ఉన్న కటౌట్‌ను చిరంజీవి తొలగిస్తుండగా, అది విద్యుత్‌ వైర్లుకు తగలడంతో విద్యుత్‌ షాక్‌కు గురై కిందపడి పోయాడు. అక్కడున్నవారు సపర్యలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. వైద్య సిబ్బంది పరీక్షించి, మృతి చెందినట్లు నిర్థారించారు. మృతుడికి తల్లి కృష్టమ్మ, భార్య హేమలత, పిల్లలు చేతన్‌, ఇషాన్‌ ఉన్నారు. మృతుడి భార్య హేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డి.నాగేంద్ర తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఘటనా స్థలికి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చేరుకుని, మృతుని కుటుంబాన్ని ఓదార్చారు. ఘటనపై కొత్తపెంట సర్పంచ్‌ రొంగలి వెంకటరావు, వైసిపి నాయకులు కొండలరావు, ఎంపిడిఒ సుబ్బలక్ష్మి, తహసీల్దారు జి.లక్ష్మీ నారాయణలను అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఫోనులో కోరారు.

మృతుడు చిరంజీవి (ఫైల్‌ఫొటో)మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, గ్రామస్తులు

➡️