ఎన్నికల హామీలన్నీ అమలు చేశాం..

Mar 6,2024 22:03
ఫొటో : విజయసాయిరెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఫొటో : విజయసాయిరెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి
ఎన్నికల హామీలన్నీ అమలు చేశాం..
– ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతటా వైసిపి అభ్యర్థులు విజయం సాధిస్తారని, ఆ స్థానాల్లో ఆత్మకూరు టాప్‌ -10లో తప్పక ఉంటుందని తెలిపారు. బుధవారం నెల్లూరులోని మేకపాటి కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు పార్లమెంట్‌ వైసిపి అభ్యర్థిగా రాజ్యసభ సభ్యులు వేణంబాక విజయసాయిరెడ్డి నియమితులయ్యాక జిల్లాకు రానుండడంతో కావలి నుండే ఆయనకు ఆహ్వనం పలికేందుకు తామంతా తరలి వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికామన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఎంఎల్‌ఎ మేకపాటి మాట్లాడుతూ గత సంవత్సరం రోజులుగా తాను చూస్తూనే ఉన్నానని, బలమైన ప్రత్యర్థి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. బలమైన ప్రత్యర్థి వస్తేనే తమకు కూడా నిరూపించుకునేందుకు వీలవుతుందని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్షేమం, ప్రజలకు తాము అందజేస్తున్న అభివద్ధితో పూర్తిగా ప్రజలందరూ తమ వెంటే ఉన్నారన్న విషయాన్ని అర్థమయ్యేలా చెబుతామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక మాట చెప్పారంటే తప్పక చేస్తారనే అభిప్రాయం ప్రజల్లోకి వచ్చిందని, మేనిఫెస్టోకు నిజమైన అర్థం చెప్పిన ఇచ్చిన ప్రతి హామీని అమలు పరిచి మళ్లీ ప్రజల ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అభివృద్ధి ఎప్పుడూ జరుగుతూనే ఉండాలని, ఆత్మకూరు నియోజకవర్గంలో మూడు జాతీయ రహదారులు, సమీపంలోనే రెండు పోర్టులు వస్తుండడంతో రానున్న రోజుల్లో పారిశ్రామికంగా అభివృద్ధి జరగనుందన్నారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి విశ్వవిద్యాలయం ద్వారా మరింత మంది ఔత్సాహికులను తయారుచేసి నియోజకవర్గ పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వాములను చేస్తామన్నారు. ఐదేళ్ల కాలంలో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అందజేసిన సంక్షేమాన్ని వివరిస్తూనే ప్రతి గ్రామానికి తాము చేయనున్న పనులను మేనిఫెస్టోలో రూపంలో వివరిస్తున్నామని, ప్రజలకు తప్పక ఆశీర్వదిస్తారని తెలిపారు. నారంపేటలోని ఇండిస్టియల్‌ పార్కు రెండో విడత పనులు సెప్టెంబర్‌ నాటికి పూర్తవుతాయని, అతి త్వరలోనే పరిశ్రమల ఏర్పాటును ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️