ఎమ్‌పిలకు పట్టని పాలకొండ

Mar 25,2024 21:44

ప్రజాశక్తి -పాలకొండ : అరకు పార్లమెంటు ఎమ్‌పిగా ఇప్పటి వరకూ ఎన్నికైన వారంత తమ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆ ప్రాంత ప్రజలు విమర్శిస్తున్నారు. ఎంపిగా గెలిచిన తర్వాత వారు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూసిన పాపం లేదు. ఓట్లు వేసిన వారు కూడా తమ ఎంపి ఎలా ఉంటారో మర్చిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 2009లో రాజకీయ ఉద్ధాండుడుగా పేరు తెచ్చుకొని కిషోర్‌ చంద్రదేవ్‌ కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా కూడా పని చేశారు. అయినప్పటికీ నియోజకవర్గానికి ఒరిగేదేమీ లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అలాగే 2014లో వైసిపి తరపున కొత్తపల్లి గీత గెలిచినప్పటికీ ఆమె నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టిన దాఖలాల్లేవు. అంతేకాకుండా అప్పట్లో అధికారంలో ఉన్న టిడిపి పార్టీలో చేరి, అక్కడ కూడా ఇమ్మడ లేకుండా జన జాగృతి అనే సొంత పార్టీ పెట్టుకుని ఇక్కడ రాజకీయ చర్చకు తెరలేపారని చెప్పవచ్చు. అనంతరం 2019లో అధికార పార్టీకి చెందిన వైసిపి అభ్యర్థి గొడ్డేటి మాధవి ఎన్నికయ్యారు. ఆమె భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ నియోజకవర్గ ప్రజలు ఆమెను గుర్తించలేని పరిస్థితి కనిపిస్తుంది. పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాల్లో ఎటువంటి కార్యక్రమాలకు కూడా పెద్దగా ఆమె హాజరు కాలేదని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది.సమావేశాలకి డుమ్మాఅరకు ఎంపిల ుగా గెలిచిన వారు ప్రజా సమస్యలు చర్చించాల్సిన ఎటు వంటి సమావేశాలకు కూడా హాజరు కావడంలేదు. సీతంపేట ఐటిడిఎ సర్వసభ్య సమావేశంతో పాటు జిల్లా పరిషత్‌ సమావేశాలకు కూడా ఎక్కడా హాజరైన దాఖలాల్లేవు. కిషోర్‌ చంద్ర దేవ్‌ కేంద్ర మంత్రి హౌదాలో రెండు సార్లు జిల్లా పరిషత్‌ సమావేశాలకు హాజరయ్యారు. అలాగే విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో ప్రస్తుతం ఎంపి మౌనం దలిచారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.నోటాకే మోజు2019 ఎన్నికల్లో అరకు ఎంపీ స్థానంలో నోటా ఓట్లే అత్యధికంగా కనిపించాయి. 47,977ఓట్లుతో మూడో స్థానం దక్కించుకుంది. అంటే ఎక్కువ మంది బరిలో ఉన్న వారికి ఓట్లు వేయడానికి ఓటరు అయిష్టత చూపారని తేటతెల్లం అవుతుంది. ఈసారి ఎంపిగా గెలిచినవారు పాలకొండ నియోజకవర్గానికి ఎంతవరకు అందుబాటులో ఉంటారో, ఏ మేరకు అభివృద్ధి చేస్తారో వేచి చూడాల్సి ఉంది. అదే విధంగా అరకు పార్లమెంటు ప్రజల గొంతు ఢిల్లీ వీధుల్లో ఎంతవరకు వినిపిస్తారో కూడా చూడాల్సి ఉంది.

➡️