ఎమ్మెల్యే అన్నాకు టికెట్‌ కేటాయించాలి

ప్రజాశక్తి-గిద్దలూరు: ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ టికెట్‌ను మరొకసారి కేటాయించాలని ఎమ్మెల్యే అన్నా రాంబాబు అభిమానులు, స్థానిక వైసీపీ నేతలు కోరుతున్నారు. ఆదివారం నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యే అన్నా అభిమానులు మాజీ మంత్రి బాలినేనిని హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా వారు బాలినేనితో మాట్లాడుతూ 2019 ఎన్నికలలో 80 వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించుకున్న రాంబాబును మళ్లీ 2024 ఎన్నికలలో గెలిపించుకోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకుపోతూ, అందరినీ నవ్వుతూ పలకరించే అన్నా రాంబాబుకు మరొకసారి టికెట్‌ కేటాయిస్తే వైసీపీ విజయానికి తిరుగుండదని వారు అన్నారు. స్పందించిన బాలినేని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లి అన్నా రాంబాబు టికెట్‌ విషయం మాట్లాడి, నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాలినేనిని కలిసిన వారిలో భూమా బాల నరసింహారెడ్డి, నెమిలిదిన్నె చెన్నరెడ్డి, బోయిళ్ల జనార్దన్‌రెడ్డి, కంభం మాజీ యార్డ్‌ చైర్మన్‌ ఏలేం వెంకటేశ్వర్లు, ఏలేం మురళి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆర్డి రామకృష్ణ, జడ్పీటీసీలు, ఆరు మండలాల కన్వీనర్లు, జేసీస్‌ కన్వీనర్లు తదితరులు ఉన్నారు.

➡️