ఎమ్మెల్సీ సాబ్జీ మృతి ఉద్యమాలకు తీరని లోటు

క్రోసూరులో నివాళులర్పిస్తున్న అంగన్వాడీలు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా:
ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) రాష్ట్ర మాజీ అధ్యక్షులు, పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి మృతి ఉపాధ్యాయ, ఉద్యోగ, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్‌ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా చెరుకువాడ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాబ్జీ మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఉపాధ్యాయునిగా కొనసాగుతూ ఉపాధ్యాయ, ప్రజా సమస్యల పట్ల అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఉద్యమం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారని కొనియాడారు. ఆశాల 36 గంటల నిరసన, అంగన్వాడీల సమ్మె శిబిరాల్లోనూ సంతాపం తెలిపారు. ఉపాధ్యాయ సమస్యలే కాకుండా ప్రజలు సమస్యలపై నిరంతరం పోరాడిన, ఎమ్మెల్సీగా అనేక సమస్యలపై శాసన మండలిలో గళం విప్పిన షాబ్జి మృతి బాధాకరమని సిపిఎం ముప్పాళ్ల మండల కార్యదర్శి జి.బాలకృష్ణ అన్నారు. మాచర్లలో యుటిఎఫ్‌, జెవివి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. నాయకులు జెవికెఎస్‌ ప్రసాదు మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా, ఉపాధ్యాయ సంఘ నాయకునిగా, ఎమ్మెల్సీగా సాబ్జి కృషిని, పోరాట పటిమను కొనియాడారు. ఆయన చిత్రపటానికి నాయకులు ఎస్‌కె గాలీబ్‌, ఎ.నాసర్‌రెడ్డి, ఎస్‌కె ఆయేషాసుల్తానా, కె.కేశవరెడ్డి, శ్రీనివాసరాజు, కేళం ఆదినారాయణ తదితరులు పూలమాలలేసి నివాళులర్పించారు. అమరావతిలో సాబ్జికి నివాళులర్పించారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పల్నాడు జిల్లా కార్యదర్శి జి.మల్లీశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మెలో మాట్లాడి ఆశాల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న సందర్భంలో ప్రమాదానికి గురై మరణించారని అన్నారు. నివాళులర్పించిన వారిలో సిఐటియు మండల కార్యదర్శి బి.సూరిబాబు, సయ్యద్‌ మోదిన్‌వలి, అంగన్వాడీలు ఉన్నారు. సాబ్జి మృతికి సిఐటియు గుంటూరు జిల్లా నాయకులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, మంగళగిరి నాయకులు వై.కమలాకర్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు హేమలత సంతాపం తెలిపారు.

➡️