ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

Dec 1,2023 20:21

 ప్రజాశక్తి-విజయనగరం కోట  :  ఎయిడ్స్‌ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ సూచించారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన అవగాహనా ర్యాలీని ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద ఆయన ప్రారంభించారు. ర్యాలీ మయూరి జంక్షన్‌, ఆర్‌ అండ్‌ బి జంక్షన్‌ మీదుగా జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా జెసి మయూర్‌ అశోక్‌ మాట్లాడుతూ, ఎయిడ్స్‌ వ్యాధి పట్ల ప్రతీఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తత ప్రచారం చేయాలని సూచించారు. ముందుగా గుర్తించి, వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే, ఎయిడ్స్‌ ప్రాణాంతకం కాదని అన్నారు. జిల్లాలో 17 చోట్ల హెచ్‌ఐవి పరీక్షలను నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎయిడ్స్‌ పరీక్షల ఫలితాలను రహస్యంగా ఉంచడం జరుగుతుందని, అందువల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. జిల్లాలో ఎస్‌.కోట, బొబ్బిలి, రాజాం ప్రాంతాల్లో ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఇతర జిల్లాలతో పోలిస్తే, జిల్లాలో ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య తక్కువేనని చెప్పారు. ఎయిడ్స్‌ నియంత్రణకు తీసుకున్న చర్యలు, అవగాహనా కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని జెసి తెలిపారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణాధికారి డాక్టర్‌ కె.రాణి, ఇతర అధికారులు, సిబ్బంది, ఎఎన్‌ఎంలు, ఆశాలు, విద్యార్థినులు పాల్గొన్నారు.

➡️