ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభ జయప్రదానికి పిలుపు

Dec 10,2023 23:03 #ఎస్‌ఎఫ్‌ఐ
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభ

ప్రజాశక్తి – కాకినాడకాకినాడ దంటు కళాక్షేత్రంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరిగే ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్‌ పిలుపునిచ్చారు. జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో కాకినాడలో ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర మహాసభకు కేరళ విద్యాశాఖ మంత్రి బిందు, ఇతర విద్యావేత్తలు, మేధావులు హాజరవుతారని తెలిపారు. నూతన విద్యా విధానం కారణంగా పేద పెద విద్యార్థులు విద్యకి దూరం అవుతున్నారు. జిఒ 117తో 3,4,5 తరగతులను హైస్‌ స్కూల్‌లో విలీనం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మండల పరిషత్‌ పాఠశాలలు మూతపడ్డాయన్నారు. వెంటనే స్కూల్స్‌ విలీనం ఆపాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వాలన్నారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఎటువంటి షరతులు లేకుండా చదువుకున్న ప్రతి ఒక్కరికీ అమ్మవడి ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న విద్యాదీవెన, వసతిదీవెన సొమ్ములను వెంటనే విడుదల చేయాలన్నారు. సంక్షేమ హాస్టల్స్‌కి సొంత భవనాలు నిర్మించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ ఛార్జీలు పెంచాలన్నారు. జిఒ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ ఇవ్వాలన్నారు. జిఒ 107,108లను రద్దు చేసి పేద విద్యార్థులకు వైద్య విద్య అందించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్‌ ఇవ్వాలన్నారు. ఈ సమస్యలపై రాష్ట్ర మహా సభలో చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ గ్లర్స్‌ రాష్ట్ర కన్వీనర్‌ సిహెచ్‌.పావని, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.వరహాలు, ఎం.గంగాసూరిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు జి.శ్రీకాంత్‌, జిల్లా సహాయ కార్యదర్శి మణికంఠ, వాసు జిల్లా కమిటీ సభ్యులు గోపాల్‌, వెంకటేశ్‌, దిల్‌రాజు, చిన్ని, అభిషేక్‌, రోహిత్‌, కిశోర్‌, చిట్టిబాబు, వరప్రసాద్‌, కె.రాజా, శ్రీవిద్య, వర్ణిక, లావణ్య పాల్గొన్నారు.

➡️