ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మెకు ఎమ్మెల్సీల మద్దతు

Dec 26,2023 21:32

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి తాము సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ తెలిపారు. మంగళవారం పార్వతీపురంలో నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల పోరాట శిబిరం వద్దకు ఇరువురు ఎమ్మెల్సీలు హాజరై తమ సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, మినిమం టైం స్కేల్‌ అమలు చేయడానికి కృషి చేయాలని, మహిళలకు చైల్డ్‌ కేర్‌ సెలవులు మంజూరు చేయాలని, పిఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు వారం రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం చర్చలకు సిద్ధపడకపోవడం దుర్మార్గమని, వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం నిరసన శిబిరం వద్ద యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహనరావు, ఎపిటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి నల్ల బాలకష్ణ, ఎపి స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ జెఎసి కన్వీనర్‌ బివి రమణ, వి ఇందిర, సమగ్ర శిక్ష ఉద్యోగుల జెఎసి నాయకులు పోలినాయుడు, లక్ష్మణరావు, ఈశ్వరరావు, రమేష్‌, భానుప్రకాష్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

➡️