ఎస్మా జిఒ పత్రాలు దగ్ధం

Jan 7,2024 21:56
ఫొటో : జిఒ పత్రాలను దగ్ధం చేస్తున్న అంగన్‌వాడీలు

ఫొటో : జిఒ పత్రాలను దగ్ధం చేస్తున్న అంగన్‌వాడీలు
ఎస్మా జిఒ పత్రాలు దగ్ధం
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : అంగన్‌వాడీల సమ్మెను అణచివేయాలని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా తీసుకొచ్చిన ఎస్మా జిఒ నెంబర్‌ రెండు కాపీలను ఆదివారం అంగన్‌వాడీలు దగ్ధం చేశారు. డిమాండ్లను పరిష్కరించాలని చేపట్టిన రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె ఆదివారం 27వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా 27రోజులగా నిరవధిక సమ్మె చేస్తుంటే పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుందన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుండా ముఖ్యమంత్రి చెప్పిన హామీలను అమలు చేయకుండా తమపై రకరకాల నిర్బంధాలను ఉపయోగించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చెప్పిందే అడుగుతున్నామని, ఆయన చెప్పిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామని తెలియజేశారు. హామీలు అమలు చేయకపోగా ఈ నిర్బంధాలు ఏమిటని, తాము ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తమ మీదే నిర్బంధాలు ప్రయోగించడం అన్యాయమన్నారు. తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పనులు చేయించడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఇది తగదని ఎన్నో పోరాటాలు చేసిన సందర్భాలు అంగన్‌వాడీ యూనియన్లకు ఉన్నదని సిఐటియు అండతో ఎన్నో కోర్కెలను సాధించుకున్నామని ఇలాంటి నిర్బంధాలు ఎన్ని ఉపయోగించిన అంత కచ్చిగా పోరాడుతామని సాధించుకుంటామని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మా డిమాండ్లు పరిష్కరించాలని అప్పటివరకు పోరాడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు కె.రఘురావమ్మ, విజయలత, కళావతి, రజిత, బిందు, జయంతి, పద్మ కుమారి, సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య, నరహరి, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

➡️